
మెదక్, ఆగస్టు 12 : అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు కృషి చేయాలని ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి కోరారు. దేశంలో ఆకలి చావులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పేదవానికి ఆహార భద్రత కల్పించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, అవి లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఆహార భద్రత చట్టం-2013 అమలు తీరును సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలుకు గ్రామ, మండలం, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీల పనితీరు, ప్రజలను చైతన్యపర్చేందుకు చేస్తున్న కార్యకలాపాలు, సమస్యల పరిష్కారానికి చేపట్టిన మెకానిజం తీరు తెన్నులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటిస్తున్నదన్నారు. ఇక్కడ లబ్ధిదారులకు అందిస్తున్న సేవలు, లోపాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సూచనలు, సలహాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కమిషన్ శ్రమిస్తుందని తెలిపారు. దాని ఫలితమే ఇటీవల రాష్ట్రంలో 3 లక్షల లబ్ధిదారులకు కొత్తగా రేషన్ కార్డులు అందాయన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 52 చౌక ధరల దుకాణాలతో పాటు అదనంగా ఏర్పడిన 157 పంచాయతీలకు మరో 30 ఎఫ్‌పీఎస్‌లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న గుడ్లు ఇస్తున్నారని ఫిర్యాదులున్నాయని, విజిలెన్స్ కమిటీ సమావేశమై బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందేలా పర్యవేక్షించాలన్నారు. ఐసీడీఎస్‌లో ఖాళీగా ఉన్న 191 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారికి సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు కేసీఆర్ కిట్ అందేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ చైర్మన్ హేమలత, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, డీఈవో రమేశ్‌కుమార్, డీడబ్ల్యూవో జయరాంనాయక్, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావు, ఆర్డీవోలు సాయిరాం, శ్యామ్‌ప్రకాశ్, ఎంఈవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సీడీపీవోలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, రేషన్ దుకాణా డీలర్లు తదితరులు పాల్గొన్నారు.