
ప్రభుత్వం రైతుబంధుతో అన్నదాతకు ముందుగానే కొత్త ఏడాది కానుకను అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కర్షకుల ఖాతాల్లో యాసంగి పంట పెట్టుబడి సాయం చేరుతున్నది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ముందుగా ఎకరంలోపు ఉన్న రైతులకు డబ్బులు జమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,25,212 మంది రైతుల ఖాతాల్లో రూ.70,12,30,928ను సర్కార్ జమ చేసింది. పెట్టుబడి సాయం జమైనట్లు సెల్ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో కొందరు బ్యాంకులకు వెళ్లి డబ్బులు కూడా డ్రా చేసుకోవడంతో వారి మోములో ఆనందం వెల్లివిరిసింది. వ్యవసాయం చేసే తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధు సంబురం మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అన్నదాత బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమయ్యాయి. యాసంగి పంట పెట్టుబడిగానూ తొలి రోజు ప్రక్రియలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 2,25,212 మంది రైతుల ఖాతాల్లో రూ.70,12,30,928 జమయ్యాయి. డబ్బులు పడినట్లు అందిన సమాచారం సెల్ఫోన్లకు మెస్సేజ్‌ల రూపంలో వచ్చాయి. తొలిరోజు ఎకరంలోగా ఉన్న అన్నదాతలకు డబ్బులు జమయ్యాయి. ప్రభుత్వం తమ ఖాతాల్లో జమ చేసిన డబ్బులను బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. రైతుబంధు డబ్బులను చూసి సంతోషపడ్డారు. సీఎం కేసీఆర్ తమను రైతుబంధువులా ఆదుకుంటున్నాడని తెలిపారు.
కేసీఆర్ రుణం తీర్చుకోలేం..
సీఎం కేసీఆర్ రైతు కష్టం తెలుసు. అందుకే పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నారు. నాకు ఎకరా భూమి ఉండడంతో యాసంగి పెట్టుబడికి గానూ రూ.5వేలు ఖాతాలో జమ అయినట్లు ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారు. రైతుబంధు ద్వారా ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయం. ఎకరానికిగానూ రూ.5 వేలు అకౌంట్లో జమయ్యాయి. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. అకౌంట్లో డబ్బులు పడడం చాలా సంతోషంగా ఉన్నది.
సంతోషంగా ఉంది
సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా ఏటా ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందిస్తున్నారు. నాకు తొలి రోజు సాయం అందినందుకు సంతోషంగా ఉన్నది. గతంలో వ్యవసాయం కోసం ఏ ప్రభుత్వాలూ మాకు ఇంత సాయం చేయలేదు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి కావడం మా అదృష్టం. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే వ్యవసాయం ఎప్పటికీ దండుగ కాదు.. పండగే.