
ఊరూరా ‘చావుడప్పు’ మోగింది..! కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరికి నిరసనగా పీఎం మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి.. దహనం చేశారు. అన్నదాతలను నట్టేట ముంచేలా వ్యవహరిస్తుందంటూ నినాదాలు చేశారు. కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటాలు ఆపమని.. తగ్గేదేలేదని ప్రకటించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై దిష్టిబొమ్మ పాడె మోశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ ఉచితంగా ఇస్తున్న వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టి అన్నదాతను ఆగం చేసే కుట్రకు కేంద్రం తెరలేపుతుందన్నారు. పంజాబ్‌కు ఒకలా.. తెలంగాణకు మరోలా న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లావ్యాప్తంగా దేవరకద్ర, జడ్చర్ల ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, మానవహారం, రోడ్లపై బైఠాయింపు నిర్వహించారు. గ్రామాల నుంచి చౌరస్తాల వరకు నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పురవీధుల్లో చావుడప్పులు మోగిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పలువురు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు రాష్ట్రం అమలు చేస్తున్న ఉచిత కరెంట్, రైతుబంధు పథకాలతో ధాన్యం ఉత్పాదకత పెరిగిందన్నారు. ఈక్రమంలోనే కేంద్రం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.