
మక్తల్ పడమటి ఆంజనేయస్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఈ వేడుకను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. తిలకించేందుకు వివిధ ప్రాతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలొచ్చారు. అంజన్న దర్శనంతో పునీతులయ్యారు. పలువురు మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దర్శనం కోసం గంటల తరబడి బారులుదీరారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 19 : నారాయణపేట జిల్లా మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుక ను తిలకించేందుకు ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్, ఏపీ, కర్ణాటకలోని బెంగళూరు, రాయిచూర్, మహారాష్ట్రలోని పూణె, ముంబయి, షోలాపూర్, ఏపీ నుంచి భక్తులు లక్షలాదిగా తరలొచ్చారు. స్వామి దర్శనంతో పరవశించిపోయారు. దీంతో జాతర ప్రాంగణమం భక్తజన సంద్రమైంది. ఆదివారం తెల్లవారుజామున స్వామికి పల్లకీసేవ నిర్వహించారు. ఐదో రోజైన సోమవారం పాల ఉట్ల కార్యక్రమం జరగనున్నది. వేడుకల్లో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఈవో సత్యనారాయణ, నాయకులు ఆశిరెడ్డి, కొండయ్య, శ్రీహరి, వర్కటం జగన్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.