
తెలంగాణ బిడ్డలయ్యేందుకు కర్ణాటక వాసులు ఉత్సాహం చూపుతున్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ
పథకాల్లో ఏ ఒక్కటీ లేవని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడి అభివృద్ధికి సరిహద్దు రాష్ట్రం నుంచి ప్రశంసలు వస్తున్నాయి. దీంతో తాము ఎంతో నష్టపోతున్నామని కన్నడిగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేయకుంటే వ్యవసాయమే లేదని కర్ణాటక రైతులు ఆందోళన చెందు తున్నారు. కలపాలనే నినాదం ఇప్పటికే రాజుకోగా.. రాయిచూర్ అర్బన్, అధికార పార్టీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ సైతం తమను తెలంగాణవాదులను చేయాలని ఓ సమావేశంలో బహిరంగంగానే డిమాండ్ చేశారు. ఈ విషయం రెండు రాష్ర్టాల్లో బాగా వైరల్ అయింది. ఇది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నది. అక్కడ అమలవుతున్న పథకాలపై ‘నమస్తే
తెలంగాణ’ బృందం పర్యటించగా.. పలువురు వారి మనోగతాలను వెల్లడించారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలోని అభివృద్ధిని చూసి సరిహద్దు రాష్ర్టాలు జై కొడుతున్నాయి. రాష్ట్రంలోని పథకాలు ఎక్కడా లేవంటూ అక్కడి ప్రజాప్రతినిధుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ఆ ప్రభుత్వంపై అసహనం వ్యక్తమవుతున్నది. కర్ణాటకలోని అధికార పార్టీ ఎమ్మెల్యే సైతం తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేసేంత అభివృద్ధి ఇక్కడ జరుగుతున్నది. రాయిచూరు అర్బన్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ ఇటీవల బహిరంగంగా చేసిన డిమాండ్ రెండు రాష్ర్టాల్లోనూ వైరలైంది. ఆ ప్రభావం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి డొల్లతనాన్ని, తెలంగాణ అభివృద్ధిని లోకానికి చాటింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులవుతున్న పక్క రాష్ర్టాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని చెప్పేందుకు రాయిచూరు అర్బన్ ఎమ్మెల్యే డిమాండ్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ తరుణంలో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రాయిచూరు జిల్లాలో ‘నమస్తే తెలంగాణ’ బృందం పర్యటించింది. కర్ణాటకలో అమలవుతున్న పథకాలపై ప్రజలతో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ పథకాల గురించి అక్కడి ప్రజల్లో చాలా మందికి తెలుసు. తెలంగాణలో ఫలాన పథకాలు ఉన్నాయని తెలియని వారికి చెప్పగానే.. తాము ఎంత కోల్పోతున్నామో అనే భావన వారిలో స్పష్టంగా కనిపించింది. కర్ణాటకలో వ్యక్తిగతంగా అమలవుతున్న పథకం కేవలం పింఛన్లు ఇవ్వడమే. అదీ వృద్ధాప్య, వితంతులకు రూ.600, దివ్యాంగులకు రూ.1200 మాత్రమే. త్వరలో రూ.200 పెంచనున్నట్లు స్థానికులు తెలిపారు. పింఛన్లు, కిసాన్ సమృద్ధి యోజన కింద ఇచ్చే రూ.6 వేలు (మూడు విడుతల్లో) మాత్రమే అక్కడ అమలవుతున్నాయి. మన రాష్ట్రంలో రైతుబంధుతోపాటు కిసాన్ సమృద్ధి యోజన కూడా అమలవుతున్నది. అంటే కర్ణాటకలో ప్రజలకు అందిస్తున్నది కేవలం పింఛన్లు మాత్రమే. అవీ కేంద్రం నిధులతోనే. ఇక్కడి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతు రుణమాఫీ సహా అనేక పథకాల గురించి చెబితే నోరెళ్లబెడుతున్నారు. ఇంతలా సంక్షేమ పథకాలు మాకెందుకు అమలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కర్ణాటకలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవని బాధపడుతున్నారు. ఇక హైదరాబాద్ కర్ణాటక రీజియన్‌లో ఉన్న రాయిచూరును ఆది నుంచి అక్కడి పాలకులు నిర్లక్ష్యానికి గురి చేశారు. ఇదే విషయాన్ని స్థానిక అర్బన్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ బహిరంగంగానే ప్రకటించారు. తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్రం కంటే పక్క రాష్ట్రమే మేలనే పరిస్థితి వచ్చింది. కేవలం ఏడేండ్లలోనే తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించి పక్క రాష్ర్టాల ప్రజలు, ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తుందంటే అదంతా సీఎం కేసీఆర్ ముందుచూపు, అభివృద్ధికి నిదర్శనంగా చెప్పొచ్చు. రాయిచూరు జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల ప్రజలు ‘మా ఎమ్మెల్యే చెప్పింది ముమ్మాటికీ కరెక్టే.. మమ్మల్నీ తెలంగాణలో కలపాలి’ అని కోరుతున్నారు. ఇక తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నేతలకు మాత్రం ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాలు కనిపించడంలేదా..? కర్ణాటకలో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేనే తెలంగాణలో కలుస్తామన్న మాటలు వినిపించడం లేదా..? అని స్థానిక టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అప్పు చేయకుంటే వ్యవసాయం లేదు..
మాకున్న ఆరెకరాల్లో వరి, పత్తి సాగు చేస్తున్నాం. పెట్టుబడి కోసం రాయిచూరు గంజిలో షావుకారు వద్దకు వెళ్లాల్సిందే. ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు అప్పు చేస్తాం. పంట పండిన అప్పు ఇచ్చిన షావుకారికే పంట అమ్ముకోవాలి. రూ.2 వడ్డీ చొప్పున అసలు, వడ్డీ పట్టుకొని మిగతా డబ్బులు ఇస్తారు. పంట పెట్టుబడి పోను పెద్దగా లాభం రాదు. ఏదో అలా ఆ ఏడాదికి కుటుంబం గడుస్తుంది. ఇన్నేండ్లు వ్యవసాయం చేసి మిగిలించిందేమీ లేదు. తెలంగాణలో మా బంధువులున్నారు. అక్కడ ఎకరాకు కేసీఆర్ సర్కార్ రూ.10 వేలు పెట్టుబడి ఉచితంగా ఇస్తాడని విన్నాం. మా వద్ద మోడీ పైసలు రూ.6వేలు మాత్రమే మూడు విడుతలుగా వస్తాయి. తెలంగాణలో మోడీ పైసలు కూడా ఇస్తరంట. ఇక్కడ రైతులకు ఒరిగేదేమీ లేదు. అందుకే మమ్మల్ని తెలంగాణలో కలిపి పుణ్యం కట్టుకోమని కోరుతున్నాం.
పైసా సాయం అందడంలేదు..
మాది తెలంగాణ సరిహద్దులోని బాపూర్ గ్రా మం. బతుకుదెరువు కోసం సాత్మైల్ గ్రామానికి వలస వచ్చాం. ఆరెకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి పండిస్తున్నాం. గంజిలో అప్పు చేసి వ్యవసా యం చేయాలి. పెట్టుబడిపోను ఎంతో కొంత మిగులుతుంది. ముగ్గురు కూతుళ్ల పెండ్లికి రూ.3 లక్షలకు పైగా అప్పు చేశాను. మేము తెలంగాణలోనే ఉండి ఉంటే కల్యాణలక్ష్మి కింద అప్పు లేకుండా నా బిడ్డల పెండ్లి చేసేటోన్ని. పెద్ద బిడ్డ డెలివరీ కోసం రాయిచూరు సర్కార్ దవాఖానకు వెళ్తే సరిగా చూడక ప్రైవేట్‌కు వెళ్లాం. సర్జరీ చేసి డెలివరీ చేశారు. రూ.50 వేలు అప్పు చేశా. 65 ఏండ్లు దాటినా పింఛన్ రావడం లేదు. వాళ్లిచ్చే రూ.600 కోసం బతిమాలడం ఎందుకని వదిలేశా. మా చెల్లెల్ని తెలంగాణలోని గట్టు మండలానికి ఇచ్చినం. అక్కడ అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు అనేక పథకాల గురించి చెప్తుంది. మా కర్మ ఇక్కడ మాకు తెలంగాణ లాంటి సర్కార్ లేదు. అంతటి పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రీ లేడు.
సాగు కోసం సేట్ వద్ద అప్పులు చేస్తున్నం..
మాది తెలంగాణలోని మక్తల్ మండలం నేరెడుగాం గ్రామం. అమ్మమ్మ వాళ్ల ఊరు కావడంతో రాయిచూర్ జిల్లా కల్మాల వచ్చి సెటిలయ్యాం. తెలంగాణలో లాగా ఇక్కడ భూములకు డిమాండ్ ఉండదు. మేం ముగ్గురం అన్నదమ్ములం. 36 ఎకరాలు ఉన్నది. ఎవరి పొలం వారే సాగు చేసుకుంటాం. పంట పెట్టుబడి కోసం రాయిచూరులో సేట్ వద్ద అప్పు చేయాల్సిందే. రెండు నదుల మధ్యన ఉన్నా.. మాకు సాగునీరు అందడం లేదు. పత్తి, శనగలు పండిస్తున్నాం. నేరెడుగాంలోని రైతులు సంగంబండ ప్రాజెక్టు కింద బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు. అక్కడ సీఎం కేసీఆర్ వాళ్లకు ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి ఉచితంగా ఇస్తున్నడు. ఇక్కడ అవన్నీ ఏమీ లేవు. అడిగే దిక్కేలేదు. రాయిచూరు అర్బన్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ అడిగినట్లుగా మమ్మల్ని తెలంగాణలో కలిపితే బాగుంటుంది.
వడ్లకు ధరే లేదు..
మాకు 20 ఎకరాల పొలం ఉన్నది. కందులు, వ రి పండిస్తున్నా. క్వింటా వడ్లకు రూ.1400 మించి రావడం లేదు. తెలంగాణలో రూ.2వేల వరకు ఇస్తున్నారని మా బంధువులు చెప్పారు. అక్కడ వ్యవసా యం పండుగలా సాగుతున్నది. మాకు ఆ పరిస్థితి లేదు. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. వ్యవసాయాధికారుల జాడ కూడా ఉండదు. రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు పంట పెట్టుబడి ఉచితంగా ఇస్తున్నడంట. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే బీమా కింద రూ.5 లక్షలు ఇచ్చి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నడు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా రూ.లక్ష ఇచ్చి మేనమామలా ఆదుకుంటున్నడు. నెలకు రూ.2వేల పింఛన్ ఇచ్చి ముసలోళ్లకు ఆసరాగా నిలుస్తున్నడు. ఇలాంటి ముఖ్యమంత్రి మా దగ్గర ఎందుకు లేడని బాధపడుతున్నం. మా ఎమ్మెల్యే కోరినట్లే మమ్మల్ని తెలంగాణలో కలపండి.
అదృష్టవంతులు
నా భర్త చనిపోయాడు. నాకు ముగ్గురు ఆడ బిడ్డలు. అప్పులు చేసి వారి పెండ్లి చేసిన. సర్కారు దవాఖానల పట్టించుకోరని నా బిడ్డ డెలివరీ కోసం ప్రైవేటుకు పోయి అప్పుల పాలయ్యాను. వ్యవసాయం చేసి బతుకుదామంటే కనీసం పెట్టుబడి లేక కౌలుకు ఇచ్చాం. పాత ఇల్లు పడిపోతే కొత్తది కట్టించుకుందామంటే ఇక్కడి ప్రభుత్వం కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే ఇస్తది. ఆ డబ్బుతో ఏం వస్తుందని ముందడుగు వేయలే. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ల బిడ్డను తెలంగాణలోని మక్తల్ ప్రాంతానికి ఇచ్చి పెండ్లి చేశారు. అక్కడి సర్కార్ అమలు చేస్తున్న పథకాల గురించి ఆమె మాకు చెప్పింది. ఈ స్కీంలన్నీ ఇక్కడ కూడా ఉంటే.. నా బిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి వచ్చేది. వారి డెలివరీ కోసం పైసా ఖర్చయ్యేది కాదు. పైగా రూ.12 వేలు, కేసీఆర్ కిట్ వచ్చే. వ్యవసాయానికి రైతుబంధు వస్తుండే. మా గుడిసె స్థానంలో డబుల్ బెడ్రూం ఇల్లు, నాకు పింఛన్ రూ.2,016 వవ్చేది. ఎంతైనా తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు.
తెలంగాణ పథకాలు ఒక్కటీ లేవు..
కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కున్షి మా సొంతూ రు. రాయిచూరులో సెటిలయ్యాను. తెలంగాణ పథకాలు, అమలును ప్రత్యక్షంగా గమనిస్తుంటాను. గురుకులాలతో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత వి ద్య అందుతున్నది. పేదిం టి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో రూ.లక్ష, కేసీఆర్ కిట్‌తో గర్భిణులకు రూ.12 వేలు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు రూ. 2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు, రైతుబంధుతో ఎకరాకు రూ.10 వేలు, రైతు చనిపోతే రూ. 5 లక్షల బీమా ఇవ్వడం చాలా గొప్ప విషయం. పెద్ద పెద్ద డబుల్ బెడ్రూం ఇండ్లు ఉచితంగా కట్టించి ఇస్తున్నారు. కానీ కర్ణాటకలో భూతద్దం పెట్టి వెతికినా ఒ క్కటంటే ఒక్క పథకమూ ఇలాంటిది లేదు. పింఛన్లు, రైతులకు కేంద్రం అందించే రూ.6 వేలు మినహా ఎలాంటి ప్రయోజనాలు లేవు. గురుకులాల సంఖ్య చాలా తక్కువే. కల్యాణలక్ష్మి వంటి పథకాలు మచ్చుకైనా కనిపించవు. సర్కార్ దవాఖానల్లో ప్రసవాలు అంటేనే భయపడే పరిస్థితి ఉన్నది. సింహభాగం ప్రసవాల కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి రూ.50వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేయక తప్పడం లేదు. విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అందుకే మా రాయిచూరును తెలంగాణలో కలపాలని ఎమ్మెల్యే పాటిల్ ప్రస్తావించారు. ఇన్ని పథకాలున్నందుకు ఎవరైనా తెలంగాణలో ఉండాలనే కోరుకుంటారు.