
ఉద్యోగుల విభజన ముమ్మరంగా సాగుతున్నది. కొత్త జిల్లాలతో పాటు జోనల్ విధానం మేరకు ప్రక్రియ
పారదర్శకంగా జరుగుతున్నది. ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి, కలెక్టర్ వెంకట్రావు నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో జీవో నెం.317 ప్రకారంగా కేటాయింపులు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 21,877 మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పటి వరకు 21,799 మంది ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం 63 శాఖల పరిధిలో 350 క్యాడర్లు ఉన్నాయి. 293 క్యాడర్ల పరిధిలో ఆప్షన్స్ ఇచ్చే ప్రక్రియ పూర్తయింది. 60 శాఖల పరిధిలో తీసుకున్న సీనియార్టీ ప్రకారమే కేటాయింపులు జరగ నున్నాయి. ఇప్పటి వరకు జిల్లా స్థాయి పోస్టులైన జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు, వాచ్మెన్లు, ఆఫీస్ సబార్డినేట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. కొత్త జిల్లాలు, జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన విధివిధానాలు జీవో నెం.317 ప్రకారం చేపట్టారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018కి లోబడి కొత్త జోన్లు, జిల్లాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ ఉంటున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో 21,877 మంది ఉద్యోగులుండగా.. ఇప్పటివరకు 21,799 మంది ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం 63 శాఖల పరిధిలో 350 క్యాడర్లు ఉండగా.. ఇప్పటివరకు 293 క్యాడర్ల పరిధిలో ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ పూర్తయింది. 60 శాఖల పరిధిలో తీసుకున్నా సీనియార్టీ ప్రకారమే కేటాయింపులు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లా నోడల్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో కేటాయింపుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జిల్లా స్థాయి పోస్టులైన జూనియర్ అసిస్టెంట్, అంతకంటే దిగువ క్యాడర్లు అయిన రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు, వాచ్మెన్లు, ఆఫీస్ సబార్డినేట్లు మొదలైనవి దాదాపుగా పూర్తయ్యాయి. ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా, ఈ నెల 8 నుంచి ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ 10 శాఖల చొప్పున ప్రక్రియ చేపడుతున్నారు. కేటాయింపులన్నీ నూటికి నూరు శాతం ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నిబంధనల మేరకే..
ఉద్యోగుల కేటాయింపు కమిటీలు సంబంధిత దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల ప్రకారం కేటాయింపు ప్రక్రియ చేపడుతున్నారు. కేటాయించిన పోస్టులకన్నా అత్యధికులు ఆప్షన్లు ఎంచుకుంటే సీనియార్టీ ప్రకారం కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టుల నిష్పత్తికి అనుగుణంగా విభజన ఉంటుంది. సీనియార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపు కోరవచ్చు. 70 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు, కుటుంబంలో మానసిక వికలాంగులైన పిల్లలున్నవారు, కారుణ్య నియామకాల్లో భాగంగా నియమితులైన వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్‌లో క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భార్యభర్తల కేసులుంటే ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన తర్వాత పరిష్కరిస్తారు. దరఖాస్తు చేసుకుంటే ఖాళీల లభ్యతను బట్టి కేటాయింపులో మార్పులు చేస్తారు. దంపతులైన ఉద్యోగులను వీలైనంతవరకు ఒకే లోకల్ క్యాడర్లో ఉండేలా చూస్తారు. ఉద్యోగుల విభజన, కేటాయింపు సమయంలో టీజీవో, టీఎన్జీవోలతోపాటు ఇతర గుర్తింపు పొందిన సంఘాలను ఆహ్వానించారు.
సకాలంలో పూర్తి చేస్తాం..
ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపులకు సంబంధించి 317 జీవో ప్రకారం అత్యంత పారదర్శకంగా చేపడుతున్నాం. ఉద్యోగుల నుంచి తీసుకునే ఆప్షన్లను స్పెషల్ కేటగిరీ, సీనియార్టీల ప్రకారంగా జాబితా రూపొందించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఆయా జిల్లాలకు కేటాయింపు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం. ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేస్తాం. పోలీసు, విద్యాశాఖ మినహా మిగతా శాఖలకు సంబంధించిన కేటాయింపులు దాదాపుగా పూర్తయ్యాయి.