కార్పొరేషన్, డిసెంబర్ 30: నగరంలో ఇంటింటికీ 24 గంటలు తాగునీటి సరఫరాకు నగరపాలక సంస్థ చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తనవంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే నాగపూర్, ఇతర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పాటిస్తున్న పద్ధతులను పరిశీలించి వచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలోని మూ డు రిజర్వాయర్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పనులు ప్రారంభించి, వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మూడు రిజర్వాయర్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్
హౌసింగ్‌బోర్డుకాలనీ, రాంపూర్, భగత్‌నగర్ రిజర్వాయర్ల పరిధిలోని డివిజన్లలో ఈ పనులు చేపట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త పైపులైన్లు వేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భగత్‌నగర్ రిజర్వాయర్‌లో నిర్మించిన సంపును ఇటీవల మేయర్ వై సునీల్‌రావు ప్రారంభించారు. 24 గంటల మంచినీటి సరఫరా పైలెట్ ప్రాజెక్ట్ కోసం రూ.18 కోట్లు ఖర్చుచేస్తున్నారు. నగరంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ పరిధిలోకి 15 నుంచి 20 డివిజన్లు రానున్నాయి. ఈ డివిజన్ల పరిధిలో త్వరలోనే 24 గంటలు మంచినీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే నగర వ్యాప్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నగరంలో రోజు నీటి సరఫరా
24 గంటల నీటి సరఫరాకు ముందుగా నగరంలోని అన్ని డివిజన్లల్లో నిత్యం నీరందిస్తున్నారు. మిషన్ భగీరథ అర్బన్ ప్రాజెక్ట్‌లో భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు మూడు రిజర్వాయర్లు నిర్మించారు. గతేడాది నుంచి నగరంలో ప్రతి ఇంటికి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. విలీన గ్రామాల్లోనూ నిత్యం నీటి సరఫరా చేసేందుకు వీలుగా ఇప్పటికే రూ. 5 కోట్లతో పైపులైన్లు వేస్తున్నారు. పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
డీపీఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలిచాం..
నగరంలో ప్రతి ఇంటికి 24 గంటలు మంచినీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నం. పైలెట్ ప్రాజెక్ట్‌గా నగరంలోని రాంపూర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, భగత్‌నగర్ రిజర్వాయర్ల పరిధిలో ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసి టెండర్లు కూడా పిలిచాం. ఇటీవల ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగింది. త్వరలోనే పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తం.