ఖలీల్‌వాడి/ నవీపేట, డిసెంబర్ 11 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లో నిజామాబాద్, కామారెడ్డికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతమయ్యాయని, ప్రజాప్రతినిధులు సంతృప్తిగా పనిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు కృషిచేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని సమస్యలపై విన్నవించారు.
బోధన్, నవీపేట మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో అభివృద్ధి పనులపై చర్చించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వి.నర్సింగ్‌రావు, నీరడి బుచ్చన్న, జడ్పీటీసీ సభ్యురాలు నేరడి సవితా బుచ్చన్న, ఎంపీటీసీలు ఉన్నారు.
ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన డీసీసీబీ చైర్మన్
బాన్సువాడ, డిసెంబర్ 11 : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి శనివారం కలిశారు. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.