ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నారాయణపేట, డిసెంబర్ 22: మున్సిపాలిటీలో మౌలిక వసతులు సమకూర్చి పేటను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో రూ.349 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణంలోని 8వ వార్డులో రూ.40లక్షలతో నిర్మించనున్న సీనియర్ సిటిజన్ పార్క్ పనులకు, 11వ వార్డులో రూ. 20లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనం పనులకు, 13వ వార్డులో రూ.50లక్షలతో ఏర్పాటు చేయనున్న సీసీరోడ్డు నిర్మాణం, రూ.15లక్షలతో ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు, రూ.22లక్షలతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 5వ వార్డులో రూ.35లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు, 13, 14 వార్డులో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 9వ వార్డులో రూ.12లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లకు, 6వ వార్డులో రూ.20లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవన నిర్మాణానికి, 14వ వార్డులో రూ.22లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లకు, 7వ వార్డులో రూ.19లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవన నిర్మానానికి, 5వ వార్డులో రూ.35లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 2వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో రూ.22 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కొత్త బస్టాండ్ వద్ద రూ.8కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నామని, రూ. 6.50 కోట్లతో స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో కొత్త గంజ్ ఎదురుగా 13 ఎకరాలలో రూ.56 కోట్లతో జిల్లా దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. పాత బస్టాండ్ వద్ద 100 పడకల చిన్నపిల్లల దవాఖాన నిర్మించామని, గతంలో జిల్లా దవాఖానలో 40కాన్పులు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం 270 వరకు కాన్పులు జరుగుతున్నాయన్నారు. సింగారం చౌరస్తా వద్ద రూ.10 కోట్లతో వీవర్స్ సర్వీస్ సెంటర్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం చేస్తామన్నారు. నూతన జిల్లా గ్రంథాలయం ఏర్పాటుకు రూ.3 కోట్ల మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే నెలలో నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణం శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మండలంలోని జాజాపూర్, కొల్లంపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుర్మిట్కల్కు చెందిన శాంతవీర సంగమేశ్వరస్వామి, మున్సిపల్ చైర్మెన్ గందె అనసూయ, కౌన్సిలర్లు జొన్నల అనిత, నారాయణమ్మ, బండి రాజేశ్వరి, గురులింగప్ప, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు విద్యావతి, సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్, సుదర్శన్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జొన్నల సుభాష్, నాయకులు బండి శివరాంరెడ్డి, దస్తగిరిచాంద్, మహిమూద్, దత్తూఢగే, మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి, ఆర్పీలు పాల్గొన్నారు.