యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తు న్నది. కేంద్రం తీరును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నది. కాగా, కేంద్రం యాసంగి ధాన్యం కొనబోమని చేతులెత్తేయడంతో రైతులు నష్టపో కుండా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు చేపడుతున్నది. రైతులు వరి స్థానంలో ఇతర, లాభసాటి పంటలు పండిం చాలని విజ్ఞప్తి చేస్తున్నది. ఈ సారి వరి వేయవద్దని సూచిస్తున్నది. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండ వని, కిలో ధాన్యం కూడా కొనమని ముందుగానే సూ చిస్తున్నది. ఇతర పంటల సాగుకు కావాల్సిన సౌకర్యాలను కల్పించేం దుకు సిద్ధమైంది. ఇటీవల సీఎం కేసీఆర్ కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. దీంతో యాసంగి సాగుపై అన్ని గ్రామాల్లో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా వరి సాగు చేయవద్దని చెప్పడంతో పాటు ఇతర పంటల సాగు, మార్కెటింగ్, లాభాలు, పెట్టుబడి తదితర వివరాలను రైతులకు విడమరిచి చెబుతున్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం కక్ష కట్టింది. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో మొండి వైఖరి అవలంభిస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో యాసంగిలో ఎక్కువగా వరి సాగవుతుంది. ఇప్పుడిప్పుడే సాగు నీరు పుష్కలంగా అందుతుండడంతో పంట విస్తీర్ణం గతేడాది నుంచి భారీగా పెరిగింది. ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రైతులపై తన ప్రతాపం చూపుతున్నది. ధాన్యం కొనే బాధ్యత కేంద్రానిది. అయినప్పటికీ దానిని విస్మరించి, రైతులను మోసం చేస్తున్నది. యాసంగి ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తన నిరసనలు తెలియజేస్తూనే ఉంది. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మనస్సును మార్చుకోవడం లేదు. నాలుగు రోజులుగా ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఉండి కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ధాన్యం సేకరణలో కేంద్రం చేతులెత్తేయడంతో యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు అని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెబుతున్నది. ఒక కిలో ధాన్యం కూడా కొనుగోలు జరుగదని ముందుగానే పేర్కొంటున్నది.
రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి..
యాసంగిలో రైతులు వరి కాకుండా ఇతర లాభసాటి పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. సీఎం కేసీఆర్ రెండు రోజుల కిందట అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. యాసంగి పంటలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామగ్రామాన రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. దీంతో అన్ని గ్రామాల్లో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యాసంగి సాగు పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వరి పంటను సాగు చేయవద్దని చెప్పడంతో పాటు ఇతర పంటల సాగు చేయడంతో మార్కెటింగ్, లాభాలు, పెట్టుబడి తదితర వివరాలను రైతులకు విడమరిచి చెబుతున్నారు. గ్రామాల్లోని రైతు వేదికలు, గ్రామ చావిడి, పంచాయతీ కార్యాలయం, ఎక్కడ రైతులు గుమిగూడితే అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు.
పంట మార్పిడితో..
పంట మార్పిడితో పంటల సరళిలో ఉత్తమమైన మార్పులు రావడంతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా చేకూరుతుంది. పప్పు దినుసులు, నూనెగింజల అవసరానికి ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. దీంతో వివిధ రకాలైన పప్పు జాతి పంటలు, నూనె గింజ పంటలను సాగు చేయాలి. మార్కెట్లో ఎదురవుతున్న సమస్యలు క్షేత్రస్థాయిలో దీర్ఘకాలిక దృష్టితో వనరులను సక్రమంగా వినియోగించడంలో భాగంగా వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలి. ప్రస్తుతం పాటిస్తున్న పంటల సరళితో అధిక పోషక విలువలు, అధిక దిగుబడి, నేల సారాన్ని పెంచే పంటలని చేర్చడంతో అధిక ప్రయోజనాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
కీరా సాగు చేస్తున్నా..
గీ యాసంగిలో వరి పెటోద్దని సీఎం కేసీఆర్ సార్ చెప్పడంతో వరి బంద్ చేసినం. 13 గుంటల్లో కీర పంట సాగు చేస్తున్నాం. దీంతో మూడు నెలలు రోజు తప్పి రోజు పని ఉండటంతో పాటు మరో ముగ్గరికి పని దొరుకుతుంది. రోజు తప్పి రోజు మా గ్రామానికి వచ్చి కీరను కొనుగోలు చేసి తీసుకెళ్లడంతో పాటు డైరెక్ట్ బ్యాంకు ఖాతాలోనే పడుతున్నాయి.
గతేడాది పొద్దుతిరుగుడు,ఈయేడు పల్లికాయ..
మాకు రెండెకరాల మామిడి తోట ఉన్నది. అయితే అంతర పంటగా గతేడాది పొద్దుతిరుగుడు వేసిన. ఇప్పుడు వేరుశనగ వేసి 20 రోజులు దాటింది. కలుపునకు వచ్చింది. బాయికాడ ఉన్న ఇంకో ఎకరంన్నరలో వరి వేద్దామనుకున్నం. ఇప్పుడు వద్దు అన్నప్పుడు, వరి పెట్టి అప్పటికీ ఇబ్బందులు పడుడు ఎందుకని అనిపించింది. అంతా పొద్దుతిరుగుడు పెడ్తదామని సాగు చేసినం. ఊకే ఒకే పంట కూడా వేయద్దు. దిగుబడి వత్తలేదు. ఓ సారి పత్తి, ఓ ఫసల్ పొద్దుతిరుగుడు, పెసర్లు, ఓ సారి పల్లికాయ, కూరగాయలు, ఉల్లిగడ్డ పెట్టింది మంచిది. ఈ మూడు, నాలుగేళ్లు సర్కారు వడ్లు కొన్నదీ కావట్టి అందరూ వరి దిక్కు చూసిర్రు. ఇప్పుడు వరి వద్దు అన్నప్పుడు మళ్ల ఎనుకటిలెక్క తీరొక్క పంట పెడ్తే మనకే మంచిది.
యాసంగిలో వరి సాగు చేయవద్దు
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలి. ఈ విషయమై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తాం. ఇతర పంటల సాగుతో మార్కెటింగ్, పంటతో వచ్చే లాభాలు, దానికి అయ్యే పెట్టుబడి ఖర్చులు వివరిస్తాం. ఈ విషయాన్ని రైతులకు వ్యవసాయ అధికారులు వివరంగా చెబుతున్నారు. యాసంగిలో వరి వేస్తే కొనుగోలు సమయంలో ఇబ్బందులు తప్పవు.. ఎవరు కూడా వరి వేయవద్దని చెబుతున్నాం. రైతు వేదికల ద్వారా గ్రామ చావిడిల్లో రైతు సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగిలో వరి పంట వేయడం శ్రేయస్కారం కాదు.
ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణలో స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు వరి పంటలను సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇతర పంటల సాగు అవసరమైన సాగు నీరు, కరెంట్ తదితర సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం తన కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి రైతులకు యాసంగి సాగు పెట్టుబడుల కోసం రైతుబంధును నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. దీంతో రైతులు యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు విత్తనాలకు ఖర్చు చేయనున్నారు. ఇటీవల కొత్తగా భూములు కొన్నవారికి సైతం రైతు బంధును ఇస్తున్నారు. యాసంగిలో ఉమ్మడి జిల్లాకు గాను సుమారుగా 900 కోట్లకుపైగా రైతుబంధు రానున్నది. డిసెంబర్ 10వ తేదీ వరకు భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ అయి ధరణిలో పేరున్న ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు అందిస్తుంది.
ప్రభుత్వ సూచనతో ఇతర పంటలపై దృష్టి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇతర పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 నుంచి 30శాతం మేర యాసంగి సాగు పనులు జరిగాయి. ఇతర పంటలతో పాటు కూరగాయల సాగును ఎక్కువగా చేస్తున్నారు. ఉమ్మడి మెదక్లో గత యాసంగిలో 5,20,923 ఎకరాలు సాగైం ది. సిద్దిపేట జిల్లాలో 2,28,448 ఎకరాలు, మెదక్ జిల్లాలో 1,86,555 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1,05,920 ఎకరాలు సాగు చేశారు. గతేడాది మొత్తం వరి పంట సాగు 4,41,648 ఎకరాల్లో సాగు కాగా, 79,275 ఎకరాలు ఇతర పంటలను సాగు చేశారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 2,06, 923 ఎకరాలు వరి పంటను సాగు చేయగా, మెదక్ జిల్లాలో 1,80,803 ఎకరాలు సాగైంది. సంగారెడ్డి జిల్లాలో 53,922 ఎకరాలు సాగైనట్లు గతేడాది వ్యవసాయ శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు యాసంగి సాగుకు అనుకూలంగా సాగు నీరు అందించడంతో రైతులు ఎక్కువగా వరి సాగును చేశారు.
1993 నుంచి ఇప్పటి వరకు వరి బంద్..
మాది అక్కన్నపేట మండలం మసిరెడ్డిరెడ్డితండా గ్రామ పరిధి రాగ్యటోనిపల్లి. నాకు మూడెకరాల పొలం ఉంది. 1993 నుంచి ఇప్పటి వరకు వరి సాగు చేయలేదు. ఏడాదిన్నరకోసారి తిండి కోసం పది గుంటల్లో సన్నవడ్లు పెడుతున్నా. అవి కూడా ఇప్పటి వరకు కిలో వడ్లు కూడా అమ్మలేదు. నా పొలంలో ఏడాదిపొడువునా కోత్తిమీర, కూరగాయాలు, ఆకుకూరలు సాగు చేస్తున్నా. బాయికాడ కకారకాయ, చిక్కుడు కాయ, మిర్చి సాగు చేశా. మరో పది రోజుల్లో కొత్తిమీర, పాలకూర అమ్మకానికి వస్తోంది. అయితే పంట మార్పిడి కింద ఒక్కోసారి ఎకరం, రెండు ఎకరాల్లో పత్తి, కంది, మక్కజొన్న సాగు చేసేటోని. ఇప్పుడు ఎవుసంలో వరితో పాటు మక్కజొన్న కూడా పూర్తిగా బంద్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే పెట్టుబడి పెట్టి మూడు, నాలుగు నెలల పంట మొఖం చూడాలి. అదే ఏ కూరగాయలైన నెల పది రోజుల్లో కాతకు వస్తే అమ్ముకోవచ్చు. కూరగాయాల సాగుతో నష్టపోయే పరిస్థితి ఉండదు.
రాష్ట్ర ప్రభుత్వం వరి కాకుండా వేరే పంటలు వేయాలని చెప్పింది కాబట్టి ఎకరం పొలంలో బొబ్బెర సాగు చేస్తున్న. పంట చుట్టూ కొద్దిగా ఉలువ లు వేశిన. ఇంకా చాలామంది రైతులు అయోమయంలో ఉన్నరు. రాజకీయా లు రైతులపై రుద్దకుండా రైతుకు ఏం అన్యాయం చేయద్దని ప్రభుత్వాల్ని కోరుతున్నాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది కాబట్టి, పెద్దలు దీనిమీద ఆలోచన జేయాలే.
నాకు కేసీఆర్ సారే ఆదర్శం
ఇతర పంటలు వేసుకోమని సీఎం కేసీఆర్ సార్ చెప్పడంతో మేం కూరగాయ పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాం. మూడు నెలలుగా వరుసగా కూరగాయలు పండిస్తూ ముందుకు సాగుతున్నాం. మాకు కేసీఆర్ సారే ఆదర్శం. ఆయన మాట మీద నిలబడి ఇతర పంటలు సాగు చేస్తున్న.
మాకున్న మూడెకరాల పొలంలో కూరగాయలు పండిస్తున్నా. దీంతో ప్రతి రోజూ చేతుల్లో డబ్బులు కనిపిస్తున్నయి. ఇప్పటి వరకు దీర్ఘకాలిక పంటలు సాగు చేసినా, గిట్టుబాటు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కానీ, కూరగాయల సాగుతో రోజు వారీగా డబ్బులు రావడంతో ఇంటి అవసరాలు, పిల్లల ఖర్చులు పోనూ చేతిలో పైసలు మిగులుతున్నయి. సీఎం కేసీఆర్ వానకాలం, యాసంగి పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటే వరికి బదులు ఇతర పంటలు వేసి సేద్యంలో స్థిరపడే అవకాశాలను కల్పించడం సంతోషంగా ఉన్నది.