
యాదాద్రి, జనవరి 5 : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, భీమ్లానాయక్ ఫేం మొగులయ్య బుధవారం సందడి చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటూ ప్రయాణికులు, ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ డిపో, బస్టాండ్‌లో 12మెట్ల కిన్నెరను వాయిస్తూ ‘జయహో ఆర్టీసీ.. జయహో సజ్జనార్’ అంటూ పాటలు పాడారు. ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్‌ను పాడి ప్రయాణికులను అలరించారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలంటూ పాట ద్వారా వినిపించారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదని.. ఆర్టీసీ బస్సులోనే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపుమేరకు రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల్లో కిన్నెరతో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని డిపోలో ప్రచారం చేశానన్నారు. విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులకు ఆర్టీసీ సంస్థ ఉచితంగా బస్‌పాస్‌లు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.