ఎల్బీనగర్ : ఎల్బీనగర్ , చింతలకుంట సెంట్రల్ మీడియన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ , ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జరగాల్సిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ నుండి చింతలకుంట చెక్‌పోస్టు వరకు పైలట్ ప్రాజెక్ట్ పనులను ముమ్మరంగా చేపడుతున్నారని అన్నారు. ప్రధానంగా ఈ రహదారిలో ప్రయాణీకులకు సిట్టింగ్ సదుపాయంతో పాటు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ పనులు చేపడుతున్నమన్నారు.
బ్యాటరీ వాహనాలు చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా అన్ని హంగులతో ఏర్పాట్లు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. రహదారిని సుందరంగా తీర్చిదిద్దేందుకు వాకింగ్ ట్రాక్ చుట్టూరా కడియం నుండి తెప్పించిన పెద్దపెద్ద చెట్లను నాటించి పచ్చదనంను పెంపొదిస్తున్నామన్నారు. అండర్‌పాస్ వద్ద స్తంబాలకు అందమైన లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఓవైసీ చౌరస్తా నుంచి ఎల్బీనగర్ వరకు, టీకేఆర్ కమాన్ నుంచి బైరామల్‌గూడ వరకు, సాగర్‌రింగ్ రోడ్డు నుంచి ఎల్బీనగర్ మీదుగా నాగోలు వరకు, చింతలకుంట నుండి హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ వరకు ఇదే విధంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ తో పాటు ఎస్ఇ అశోక్‌రెడ్డి, ఇఇలు, డీఇలు పాల్గొన్నారు.