
లోక రక్షకుడు, కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఆర్సీఎం, సీఎస్ఐ చర్చీలు, పలు క్రైస్తవ మందిరాలు, కాపరుల సంఘ మందిరాలను ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రైస్తవ విశ్వాసుల ఇళ్లపై రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ప్రతి ఇంటి ఎదుట క్రిస్మస్ ట్రీ, పశువుల పాక వెలిశాయి. చర్చీల్లో విశ్వాసులతో సందడి నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, డిసెంబర్ 24: లోకరక్షకుడి జన్మదినం ఎంతో మహిమాన్వితమైనది. పవిత్రమైనది. క్రైస్తవులు అత్యంత ఆనందోత్సాహాలు, భక్తి ప్రపత్తులతో జరుపుకునే క్రిస్మస్ వేడుకలకు ఉమ్మడి జిల్లా సన్నద్ధమైంది. ఆర్సీఎం, సీఎస్ఐ చర్చిలు, పలు క్రైస్తవ మందిరాలు, సంఘ కాపరుల మందిరాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరమయ్యాయి. కరుణామయుడి జన్మదినం లోకానికి వెలుగునిచ్చిందన్నది క్రైస్తవ విశ్వాసుల నమ్మకం. పాప ప్రక్షాళన, లోక కల్యాణం జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటే దయామయుడి బోధనలు, ప్రభువు చూపిన మార్గాలే కారణమన్నది వారి విశ్వాసం. అందుకే ఈ రోజున వాడవాడలా క్రీస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినం అయినప్పటికీ.. వేడుకలు మాత్రం నెలరోజుల ముందునుంచే ప్రారంభమయ్యాయి. ఈనెల రోజులూ క్రైస్తవ విశ్వాసుల ఇళ్లపై రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ప్రతీ ఇంటి ఎదుట క్రిస్మస్ ట్రీ, పశువుల పాక వెలిశాయి. సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ రోజున చర్చిల ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ క్యారల్స్ అతి ముఖ్యమైన కార్యక్రమం.
క్రీస్తు జన్మదినాన్ని చాటిన కాన్స్లాంటిన్
రోమ్ సామ్రాజ్యానికి చెందిన తొలి క్రైస్తవ చక్రవర్తి అయిన కాన్స్లాంటిన్ క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా ఆచరించడం ప్రారంభించారు. క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా ఆచరిస్తున్నారు. ఈ సంప్రదాయం ఆయన పుట్టిన 356 ఏళ్ల తర్వాత ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత పోప్ జూలియన్ డిసెంబర్ 25ను క్రీస్తు జన్మదినంగా అధికారికంగా ప్రకటించారు. కానీ క్రిస్మస్ను ప్రపంచం అంతటికీ పరిచయం చేసిన ఘనత మాత్రం బ్రిటన్కు చెందిన సెయింట్ ఆగస్టీన్కు దక్కుతుంది. ఈయన రోమన్ క్యాలెండర్ ఆచరించే పాశ్చాత్య దేశాలన్నింటికీ ఈ పండుగను పరిచయం చేశారు. భారతదేశంలో క్రైస్తవులు తొలి శతాబ్దం నుంచే ఉన్నప్పటికీ.. క్రిస్మస్ ఆచరణ మాత్రం బ్రిటిషర్ల మిషనరీల రాకతోనే ప్రాచుర్యంలోనికి వచ్చింది.
అర్ధరాత్రి నుంచే ఆరాధనలు మొదలు..
ఉమ్మడి జిల్లాలో క్యాథలిక్ మిషన్ (ఆర్సీఎం)కు చెందిన పలు చర్చిల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ ఆరాధానలను ప్రారంమయ్యాయి. ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, నాయుడుపేట, ఖమ్మం నగరంలోని వైరారోడ్డు, శ్రీనివాసనగర్, మౌంట్పోర్టు, తల్లాడ, కల్లూరు ఆర్సీఎం చర్చీలతోపాటు కొత్తగూడెం, భద్రాచలంలోని ఆర్సీఎం చర్చిల్లో శుక్రవారం రాత్రి 11 గంటల నుంచే క్రిస్మస్ ఆరాధనలను మొదలుపెట్టారు. ప్రొటాస్టేన్స్ చర్చిలైన ఖమ్మంలోని సెయింట్ మేరీస్, సీఎస్ఐ, ఎన్ఎస్పీ క్యాంపు హోలిట్రీనిటీ చర్చి, ఇందిరా నగర్ సీఎస్ఐ క్రైస్ట్, ఖానాపురం హవేలీ లివర్స్, కూసుమంచి ఇమ్మాన్యూయేల్, కొత్తగూడెం ఆండ్రూస్, భద్రాచలం సీఎస్ఐ క్రైస్ట్, పాల్వంచ, ఇల్లెందు, వైరా, రుద్రంపూర్, రామవరం, సత్తుపల్లిలోని సీఎస్ఐ చర్చీల్లో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్రిస్మస్ ఆరాధానలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ మందిరాలన్నీ విశ్వాసులతో కిటకిటలాడనున్నాయి.