
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 18: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంటల పెట్టుబడి సొమ్ము ఈ నెల 28 నుంచి రైతుల అకౌంట్లలో జమ కానుంది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శనివారం జరిగిన రాష్ట్ర మంత్రులు, జిల్లాల కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే అర్హత కలిగిన రైతుల వివరాలను జిల్లా రెవెన్యూ అధికారులు రాష్ట వ్యవసాయశాఖకు అందజేశారు. దీంతో ఈ సీజన్లో ఖమ్మం జిల్లాలోని 21 మండలాలకు చెందిన 3,16 385 మంది రైతులకు రెండో విడతగా ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.362.76 కోట్లకు అందజేయనున్నారు. యాసంగి సీజన్ సాగు పనులు ప్రారంభమైన సమయంలో సకాలంలో రైతుబంధు పంపిణీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 28 నుంచి ప్రారంభించి కేవలం పది రోజుల్లోనే పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలివ్వడంతో పనులు వేగవంతమయ్యే అవకాశముంది.