సహకార రంగంలో సేవాభావం ఉంటేనే ఆ సంస్థలు రాణిస్తాయని, ఈ విషయంలో కేడీసీసీబీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీబీ) శతాబ్ది ఉత్సవాల్లో మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు కేడీసీసీ బ్యాంకు ఆవరణలో నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజులు సహకార పతాకాన్ని, వందేళ్ల పైలాన్‌ను కేడీసీసీబీ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావుతోపాటు పాలకవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి సహకార దిగ్గజాలు తరలివచ్చారు.
కరీంనగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశంలో సహకార వ్యవస్థ అద్భుతాలు సృష్టిస్తున్నదని చెప్పడానికి కేడీసీసీబీని ఉదాహరణగా చెప్పవచ్చని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన కేడీసీసీబీ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ బ్యాంకు తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో 2005లో కొండూరు రవీందర్రావు చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి అనేక సంస్కరణలు తెచ్చి లాభాల బాటలో నడుపుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తమ ప్రభుత్వం వ్యవసాయం, డెయిరీ, మత్స్య, పాడి పరిశ్రమల రంగాల్లో ఘననీయమైన ప్రగతిని సాధించిందన్నారు. నాబార్డు ద్వారా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడ్డారు.
క్రిభ్కో చైర్మన్, అంతర్జాతీయ సహకార కూటమి (పశ్చిమ ఆసియా) చైర్మన్ చంద్రపాల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇంత పెద్ద రంగానికి సహకారాన్ని అందిస్తున్న సహకార రంగానికి ప్రభుత్వాలు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. దేశంలో 90 శాతం మంది రైతులు సహకార బ్యాంకుల సేవలు పొందుతున్నారని, కరీంనగర్ సహకార బ్యాంకును జాతీయ స్థాయిలో ఉత్తమ బ్యాంకుగా నిలిపిన నాఫ్స్కాబ్ చైర్మన్‌గా ఉన్న రవీందర్రావు అభినందనీయులని అన్నారు.
ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని మాట్లాడుతూ ఒక పేద రైతు బిడ్డ విదేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితిని కరీంనగర్ సహకార బ్యాంకు కల్పిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి సెక్టార్లో సహకార రంగం అభివృద్ధి
చెందాల్సిన అవసరం ఉందన్నారు..
నాఫెడ్ వైస్ చైర్మన్ సునిల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ దేశంలోని పేద రైతులకు సేవలు అందిస్తున్న సహకార బ్యాంకులను ప్రోత్సహించాలన్నారు. బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోవడానికి కారణాలను గ్రహించాలన్నారు. కరీంనగర్ సహకార బ్యాంకును స్ఫూర్తిగా తీసుకొని దేశంలోని బ్యాంకులన్నీ ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు.
ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం: కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు
శత వసంతాల బ్యాంకు ఇంత ప్రగతిని సాధించేందుకు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నదని కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు గుర్తు చేశారు. ఉత్సవాల్లో అధ్యక్షోపన్యాసం చేసిన ఆయన బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. 2005లో బ్యాంకు చైర్మన్‌గా తాను బాధ్యతలు తీసుకున్నతర్వాత పలు సంస్కరణలు తెచ్చామని, 2007-08లో సంఘాలను బలోపేతం చేసేందుకు నాబార్డ్ పరిధిలోని ఐసీడీపీ నుంచి రూ.16 కోట్లు రుణంగా తీసుకున్నామన్నారు. 2008-09లో బ్యాంకును కంప్యూటరీకరణ చేశామని, 2009-10లో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రుణాలు ఇవ్వడం మొదలు పెట్టామని, ఇపుడు రూ.200 కోట్ల వరకు రుణాలు ఇచ్చామన్నారు. ఇలాంటి పలు సంస్కరణలు తెస్తూ 2012 నుంచి వెనక్కి తిరిగి చూడకుండా కేడీసీసీబీ లాభాల బాటలో ముందుకు సాగుతోందన్నారు. ఇప్పుడు వాహనాలు, గృహ రుణాలతో పాటు రైతుల బిడ్డలు లండన్, అమెరికా, ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు విద్యపైనా రుణాలు ఇస్తున్నామని చెప్పారు. 20 ఏండ్ల నుంచి బ్యాంకు ఉద్యోగుల నియామకం జరగలేదని, 2012-13లో మొదటిసారి, 2018-19లో రెండోసారి మొత్తం 3 వేల మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. బ్యాంకు పరిధిలోని 128 సంఘాలను లాభాల బాటలో నడిపిస్తున్నామని, వాణిజ్య బ్యాంకులకు దీటుగా రుణాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
దేశం నలుమూలల నుంచి దిగ్గజాలు హాజరు
సభకు రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలు మూలల నుంచి సహకార దిగ్గజాలు తరలి వచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా స్థలిలో జ్యోతిప్రజ్వలనచేసి ఉత్సవాలను ప్రారంభించారు. సహకార పతాకాన్ని ఎగుర వేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తదితరులు శతవసంతాల సావనీర్‌ను, డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ అధ్యక్షులు కనుమల్ల విజయ, పుట్ట మధూకర్, అరుణ, వసంత, మేయర్ వై సునీల్ రావు, నాఫ్స్కాబ్ ఎండీ భీమా సుబ్రహ్మణ్యం, టీఎస్ స్కాబ్ ఎండీ డాక్టర్ మురళీధర్, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగళి రమేశ్, పాలకవర్గ సభ్యులు, సీఈవో సత్యనారాయణ రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఎన్సీడీసీ అవార్డుల ప్రదానం
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన సహకార సంఘాలకు ఎన్సీడీసీ నుంచి అవార్డులు ప్రదానం చేశారు. జగిత్యాల జిల్లా పైడిమడుగు సింగిల్ విండోకు అవార్డుతో పాటు రూ. 25 వేల నగదు పురస్కారం అందించారు. దీనిని సింగిల్ విండో చైర్మన్ జగన్మోహన్రావు అందుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అవార్డుతోపాటు రూ. 20 వేల నగదు పురస్కారం, వరంగల్ జిల్లా ఊకల్ సింగిల్ విండో చైర్మన్ ఎం వీరాస్వామి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్కు చెందిన ఫార్మర్స్ అసోసియేషన్ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మహిళా సొసైటీ అధ్యక్షురాలు అరుణ, నిర్మల్ జిల్లాకు చెందిన మహిళా సొసైటీ అధ్యక్షురాలు నాగమణి అవార్డులు అందుకున్నారు. వీరికి బహుమతితోపాటు రూ. 20 వేల నగదు పురస్కారం అందించారు.
తెలుగు రాష్ర్టాల నుంచే అధిక ఆదాయం : నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజు
దేశానికి రాజునైనా తల్లికి కొడుకే అన్నట్లు తాను నాబార్డ్ చైర్మన్ అయినా తెలుగువాడినేనని, నాబార్డ్‌కు వచ్చే ఆదాయంలో సింహభాగం తెలుగు రాష్ర్టాల నుంచే వస్తుందని నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజు పేర్కొన్నారు. సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే సంఘాలు పటిష్టంగా ఉండాలని, సంఘాలు పటిష్టంగా ఉండాలంటే లెక్కలు సరిగ్గా ఉండాలన్నారు. రైతులు ఒకసారి కార్పొరేట్ల చేతికి చిక్కితే అందులోంచి బయటికి రావడం చాలా కష్టమని, ఒకప్పుడు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రైతులను బయటికి తెచ్చింది సహకార వ్యవస్థేనని గుర్తు చేశారు. కేబీసీసీ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు దీటుగా రుణాలు ఇస్తోందని, ఈ వ్యవస్థను తాను ఇక్కడే చూస్తున్నానని స్పష్టం చేశారు. తాను 1991-98 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశానని, అప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందన్నారు.
కేడీసీసీబీ అద్భుత ప్రగతి : మంత్రి గంగుల
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం, సిబ్బంది పనితీరువల్లనే ఇంత అద్భుత ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. చైర్మన్ కొండూరు రవీందర్రావు ఆధ్వర్యంలో వచ్చిన అనేక సంస్కరణలు రైతుల మన్ననలు అందుకుంటున్నాయన్నారు. సహకార ఆర్థిక వ్యవస్థకు మూలాలైన నాబార్డ్, ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్, తదితర సంస్థల అధినేతలు కేడీసీసీబీ శతాబ్ది ఉత్సవాలకు రావడం అభినందనీయమన్నారు. నాబార్డు సంస్థ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చే విధంగా విధానాలు రూపొందించాలని నాబార్డ్ చైర్మన్‌ను కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకునేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు.
రాజకీయ జోక్యం ఉండొద్దు : వినోద్‌కుమార్
సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం ఉండవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. యాసంగి ధాన్యం కొనాలని కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చినా స్పందించిన పాపాన పోలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడి చేసుకోవడం తప్పనిసరని, ఇందుకు సహకార సంఘాలు కృషి చేయాలని కోరారు. ఇతర పంటల సాగుకు రుణాలు అందించి ప్రోత్సహించాలని కోరారు. సహకార సంఘాల్లో పనిచేసే వారికి సేవా భావం ఉండాలని, కరీంనగర్‌కు ఎటు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇటు వరంగల్, అటు నిజామాబాద్ బ్యాంకులు నష్టాల్లో నడుస్తుండగా ఇక్కడి బ్యాంకు లాభాల్లో ఎందుకు నడుస్తున్నదో అర్థం చేసుకోవాలన్నారు.