రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): కార్మికక్షేత్రంలో వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కారు అప్పారెల్ పార్కును ఏర్పాటు చేసింది. సిరిసిల్ల పెద్దూర్ శివారులోని 65 ఎకరాలు 175 కోట్లతో దీనిని ఏర్పాటు చేయనుండగా, 2017 అక్టోబర్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. బెంగళూర్‌కు చెందిన గోకల్దాస్ సంస్థ భవన నిర్మాణాలకు గతేడాది జూలై 30న శంకుస్థాపన చేశారు. నిర్మాణాలు దాదాపుగా పూర్తి కాగా, ఇదే సమయంలో ‘నిట్వేర్’ (దుస్తులు) తయారీపై మహిళలు, యువతులకు దశలవారీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తర్ఫీదు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 700 మందికి బెంగళూర్‌కు చెందిన ట్రెయినర్లు కుట్టు శిక్షణ ఇచ్చారు. లక్షల విలువైన కుట్టు మిషన్లపై దుస్తుల తయారీతోపాటు మిషన్ చెడిపోతే మరమ్మతు చేసుకునేలా ట్రైనింగ్ ఇచ్చారు. కోయంబత్తూర్ కంపెనీకి చెందిన టెక్నికల్ సిబ్బందితో శిక్షణ ఇప్పించారు. శిక్షణ పొందిన 700 మందికి పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించనున్నారు. అలవెన్సులు పోనూ నెలకు పది వేలకు పైనే వేతనం పొందే అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభించేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
‘నిట్వేర్’లో ట్రయల్ రన్ ప్రారంభించిన గోకల్దాస్ సంస్థ ఈ నెలాఖరులో పూర్తి స్థాయిలో లోదుస్తుల తయారీ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఫిబ్రవరిలోనే ప్రారంభించాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. చేనేత జౌళీ శాఖ నిర్మించిన భారీ షెడ్డులో తాత్కాలికంగా 200 మిషన్లను ఏర్పాటు చేశారు. అందులో బెంగళూర్‌కు చెందిన పది మంది యువతులు జిల్లా మహిళలకు శిక్షణ ఇచ్చారు. గోకల్దాస్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులతో పాటు శిక్షణ పొందుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. సిరిసిల్లకు మరిన్ని కంపెనీలు తరలి వచ్చేలా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు.
చేనేత, వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్లలో గార్మెంట్ పరిశ్రమ విస్తరిస్తున్నది. ఒకప్పుడు బీడీ పరిశ్రమకే పరిమితమైన మహిళలు నేడు గార్మెంట్ పరిశ్రమలో రాణిస్తున్నారు. జిల్లాలో 150 వరకు గార్మెంట్ పరిశ్రమలు నెలకొన్నాయి. నిరుద్యోగ యువత చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుని వ్యాపారం చేస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూర్ నుంచి రామెటీరియల్ తెచ్చుకొని ఇక్కడ షర్టులను తయారు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తరలి రావడంతో సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ విశ్వవ్యాప్తం కానున్నది. హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లిలో అతిపెద్ద గార్మెంట్ పరిశ్రమలున్నాయి. అందులో పనిచేస్తున్న జిల్లా వాసులంతా అప్పారెల్ పార్కులో పనిచేసేందుకు వాపస్ వస్తున్నారు. హైదరాబాద్, ముంబాయి, బెంగళూర్, తమిళనాడుకు వలస వెళ్లిన వారంతా ఇక్కడి కంపెనీల్లో పనిచేసేందుకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అప్పారెల్ పార్కులో కంపెనీలు ప్రారంభమైతే సొంత జిల్లాలోనే వేలాది మందికి ఉపాధి లభించే అవకాశమున్నది.
సిరిసిల్ల జిల్లాలో వెయ్యి మందికి పని కల్పించాలన్నది సంస్థ లక్ష్యం. అందులో భాగంగా బ్రాండెడ్ దుస్తుల తయారీలో 700 మహిళలకు శిక్షణ ఇచ్చాం. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు మా సంస్థలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. లోదుస్తుల తయారీ చేపట్టాం. తయారైన వాటిని కేంద్ర బ్రాంచ్‌కు తరలిస్తున్నాం.
– రామ్, టెక్నీషియన్, గోకుల్దాస్ కంపెనీ(బెంగళూర్)
గోకల్దాస్ కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో అనేక బ్రాంచ్‌లు ఉన్నాయి. వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది. ఇక్కడి మహిళలకు దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు బెంగళూర్ నుంచి పది మందిమి వచ్చాం. ఇప్పటి వరకు 700 మందికి పూర్తి స్థాయిలో నైపుణ్య శిక్షణ ఇచ్చాం. వారికి కంపెనీనే పని కూడా కల్పిస్తుంది. ‘నిట్వేర్’లో ట్రయల్ రన్ ప్రారంభించి సక్సెస్ చేశాం. ఇక్కడ తయారైన దుస్తులు బెంగళూర్‌కు పంపించాం. వాటిని అన్ని షాపుల్లో విక్రయిస్తారు.
– భారతి, నిట్వేర్ ప్రిన్సిపాల్
అప్పారెల్ పార్కులో గోకల్దాస్ కంపెనీ దుస్తుల తయారీని ప్రారంభించింది. ప్రస్తుతం ట్రయల్న్ నడుస్తున్నది. వెయ్యి మంది కార్మికులకు పని కల్పించాలన్న లక్ష్యం మేరకు మహిళలకు శిక్షణ ఇస్తున్నది. ఇందులో పనిచేసే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. మంత్రి కేటీఆర్ చొరవతో మరో దిగ్గజ సంస్థ టెక్స్‌పోర్టు ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. త్వరలోనే శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ సంస్థకు షెడ్డు నిర్మించి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– తస్లిమా, సంయుక్త సంచాలకురాలు, రాష్ట్ర చేనేత జౌళీశాఖ
అప్పారెల్ పార్కులో మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ టెక్స్‌పోర్టు ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. ఫిబ్రవరి 27న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 60 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. చేనేత జౌళీ శాఖ షెడ్డు నుంచి గోకల్దాస్ సంస్థ తమ సొంత భవనంలోకి వెళ్లనుంది. ఖాళీ అయిన షెడ్డులో టెక్స్‌పోర్టు ఇండస్ట్రీస్ వస్తుంది. అందులో జూకీ కుట్టు మిషన్లపై మహిళలకు టీషర్టులు, జీన్స్ ప్యాంట్ల తయారీలో నైపుణ్య శిక్షణ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కనీసం 1500 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.