
ఖమ్మం సిటీ, జనవరి 7: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వందల సంఖ్యలో కండల వీరులు ఒకే చోట కొలువుదీరారు.. తమ కండ బలాన్ని ప్రదర్శించారు.. రక రకాల విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచారు.. అందుకు ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ వేదికైంది. నగరానికి చెందిన న్యాయవాది, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వామి రమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నేషనల్ సీనియర్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు అంకురార్పణ జరిగింది. పారిశ్రామికవేత్త రామసహాయం రఘురాంరెడ్డి పోటీలను ప్రారంభించారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన బాడీ బిల్డర్స్ పోటీల్లో పాల్గొన్నారు. బరువు ఆధారంగా నాలుగు రకాల పోటీలు, వ్యక్తిగత ప్రాతిపదికన మరో నాలుగు పోటీలు జరిగాయి. చివరి రోజు శనివారం అన్ని విభాగాల్లో ఫైనల్స్ జరుగనున్నాయి. ముఖ్యఅతిథులు విజేతలకు బహుమతులు అందజేస్తారు. పోటీలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి పరిశీలించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు.