కామారెడ్డి, డిసెంబర్ 24: కరోనా వ్యాక్సినేషన్‌ను కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం వేగవంతంగా చేపడుతున్నది. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, రేషన్ దుకాణాలు, కమ్యూనిటీ వార్డులు, కాలనీల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా టీకాలు వేస్తున్నారు. ఫస్ట్ డోస్ తీసుకోని వారిని గుర్తించి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫస్ట్ డోస్ తీసుకొని గడువు ముగిసిన వారికి రెండో డోస్ వేస్తున్నారు. 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించడంతో టీకాలు వేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు 247 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల 79వేల 3 వందల 92 మంది జనాభా ఉండగా, వీరిలో 7,38,656 మంది 18 ఏండ్లు పైబడిన వారున్నారు. ఇప్పటి వరకు 10,14,501 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇందులో మొదటి డోస్‌ను 6,15,815 మంది వేసుకోగా, 85 శాతం వ్యాక్సినేషన్ జరిగింది. రెండో డోస్‌ను 3,98,686 మంది వేసుకున్నారు. శుక్రవారం మొదటి డోస్ 1061 మంది, రెండో డోస్ 9,164 మంది వేసుకున్నారు. జిల్లా పరిధిలోని 211 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో వైద్యారోగ్య శాఖ సిబ్బందితోపాటు అంగన్వాడీ, మున్సిపల్, పంచాయతీ రాజ్, మెప్మా, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొని 18 ఏండ్లు నిండిన వారంతా టీకా వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్..
వైరస్ వేరియంట్లు మారుతున్న తరుణంలో వందశాతం వ్యాక్సినేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలో రాజీవ్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, రాజంపేట, సదాశివనగర్, దేవునిపల్లి పీహెచ్‌సీలు వ్యాక్సినేషన్లో ముందంజలో ఉన్నాయి. ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్తూ కరోనా వ్యాక్సిన్ తీసుకోని, టీకాలంటే భయపడుతున్న వారికి అవగాహన కల్పిస్తూ టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లోకి వెళ్లిన వారికి అక్కడే టీకాలు ఇస్తున్నారు. మొదటి డోస్ పూర్తయిన వారికి రెండో డోస్ వేసుకోవాలని ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఏదైనా గ్రామంలో టీకా తీసుకోని వారు పెద్ద సంఖ్యలో ఉంటే వైద్య సిబ్బంది అక్కడికే వెళ్లి టీకాలు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో ప్రజలందరూ టీకా తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నా రు. జిల్లాలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ వేగవంతంగా చేపట్టేందుకు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రత్యేక బృందాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రోజూ వారీగా వేస్తున్న టీకాల వివరాలను తెలుసుకుంటున్నారు.
18 ఏండ్లు పైబడిన వారందరికీ..
అర్హులందరికీ కరోనా టీకా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో 247 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నాం. 211 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఇంటింటా తిరుగుతూ టీకా వేసుకోని వారికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలందరూ సహకరించి తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి.