సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పట్టారు. విద్యాసంస్థలకు సెలవులు రావడం, పండుగ సమీపిస్తుండటంతో సొంతూర్లకు బయల్దేరుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున తరలి వెళ్తుండడంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. ఆదివారం 65వ జాతీయ రహదారిపై వాహనాలు బారులు దీరాయి.
చౌటుప్పల్ / చౌటుప్పల్ రూరల్, జనవరి 9 : సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరవాసులు ఇంటిబాట పట్టడంతో చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం రెండోరోజూ రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద మధ్యా హ్నం రద్దీ నెలకొంది. ఫాస్టాగ్ కేంద్రాలు ఉండటంతో పెద్దగా ఇబ్బంది లేకుండా వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. టోల్‌ప్లాజా వద్ద ఇరువైపులా 16కౌంటర్లు ఉండగా అందులో విజయవాడ వైపు 9కౌంటర్లు తెరిచారు. ఈ రహదారి వెంట నిత్యం 28వేల వాహనాలు వెళ్తుంటాయి. వారాంతాల్లో, శుభకార్యాలు విరివిగా ఉన్నప్పుడు మరో 3-4వేలు అదనంగా వెళ్తుంటాయి. పండుగ నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో ఫాస్టాగ్ లేక వాహనాలు కిలోమీటర్ల మేర బారులుదీరగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఫాస్టాగ్‌లో నగదు లేని వారు నేరుగా రుసుము చెల్లించే క్రమంలో కొంత ఆలస్యమవుతున్నది. దీంతో కొంతమేరకు రద్దీ నెలకొంటున్నది. అదేవిధంగా వాహనాల రాకతో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రద్దీ నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు వచ్చిన వాహనాలను వచ్చినట్టుగా తరలించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.