చార్మినార్ : చారిత్రక ప్రదేశం సందర్శకులతో హోరెత్తిపోయింది. చారిత్రక చార్మినార్ వద్ద ఏక్ షామ్ చార్మినార్‌కే నామ్‌తో పాతనగరం సరికొత్త వాతవరణాన్ని పరిచయం చేసింది. సందర్శకుల కొనుగోళ్లతో ఆదివారం సాయంత్రం చార్మినార్‌కు కొత్త కళ వచ్చింది.
పాతనగర చారిత్రక ప్రాంతాల్లో పర్యాటకులు తమ అనందాలను పదిలం చేసుకుంటూ హుషారుగా సండే ఫన్డేలో పాల్గొన్నారు. ఆదివారం చారిత్రక చార్మినార్ వద్ద నిర్వహించిన సండే ఫన్డే అధికారులతోపాటు ప్రజల్లో, వ్యాపార వర్గాల్లో జోష్ నింపింది.చార్మినార్ వద్ద నిర్వహించిన ఫన్ డే స్టేజీ లైవ్ షో యువతను ఉర్రూతలూగించింది.
చిన్నా పెద్ద తేడాలేకుండా సంగీత హోరులో హుషారుగా అడుగులు వేసుకుంటూ మదిలో గీతాలు ఆలపిస్తూ సింగర్లకు తోడుగా తమ స్వరాలను సవరించుకున్నారు. చార్మినార్ అనగానే లాడ్ బజార్లో షాపింగ్ చేయందే సందర్శకులు వెనుదిరగరు.
రకరకాల గాజులకు పెట్టింది పేరైన లాడ్ బజార్లో చేతులకు కొత్త అందాలను అందించే మట్టి గాజులతోపాటు లక్కగాజులనుఎంతో ఇష్టంగా కొనుగోళ్లు చేస్తూ సందర్శకులు మరింతగా మైమరిచి పోయారు.