సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. ఉద్యోగ ‘గని’గా అవతరించింది. బొగ్గు ఉత్పత్తి.. టర్నోవర్.. లాభాలు ఆర్జించడమే కాకుండా యువతకు కొలువులు కల్పించడంలోనూ అగ్రగామిగా బాసిల్లుతున్నది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంస్థ గత ఏడేండ్లలో ఓపెన్ రిక్రూట్మెంట్, కారుణ్య, వారసత్వ నియామకాల ద్వారా 16,051 మందికి ఉద్యోగాలు కల్పించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్ చేసిన సంస్థల్లో సింగరేణి అగ్రస్థానంలో నిలిచింది.
58 నోటిఫికేషన్లు.. 3,498 మందికి ఉద్యోగాలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు సంస్థలోని వివిధ శాఖల్లోని పలు రకాల కార్మిక, అధికారుల స్థాయిలో ఖాళీలను గుర్తించింది. తదనుగుణంగా భర్తీ కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 58 నోటిఫికేషన్లు జారీ చేసింది. 3,498 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించింది. ప్రతిభావంతులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి కంప్యూటర్ ఆధారంగా నిర్వహించింది. అలాగే ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా ఒత్తిళ్లు ఉంటాయని, అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని భావించిన సంస్థ.. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసింది. రాత పరీక్ష జరిగిన రోజునే ఫలితాలు వెల్లడించి, అపోహలకు తావులేకుండా నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ తరహా పారదర్శక పరీక్షల నిర్వహణతో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల్లోని ఉద్యోగ నియామక ఏజెన్సీల ప్రశంసలు అందుకున్నది. ఈ తరహా ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా 2,925 కార్మిక తరహా పోస్టులు, 562 అధికార హోదా పోస్టులను భర్తీ చేసింది.
35 కేటగిరీల్లో..
సింగరేణి సంస్థ మొత్తం 35 కేటగిరీల్లో ఉద్యోగాలు కల్పించింది. వీటిలో ప్రధానంగా మైనింగ్ సూపర్వైజర్లు 809, ఫిట్టర్లు 578, క్లర్క్‌లు 471, ఎలక్ట్రీషియన్లు 358, మెకానికల్ సూపర్వైజర్లు 141, టర్నర్, మెషినిస్ట్‌లు 121, వెల్డర్లు 94, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు 84, స్టాఫ్ నర్సులు 68, సివిల్ సూపర్వైజర్లు 65, సర్వేయర్లు 48, మోటార్ మెకానిక్‌లు 40, మౌల్టర్లు 24 తదితర కొలువులు ఇచ్చింది. అలాగే అధికారి హోదాలో మైనింగ్ ఇంజినీర్లు 136, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు 131, స్పెషలిస్ట్ డాక్టర్లు 69, పర్సనల్ ఆఫీసర్లు 8, ఫైనాన్స్ అధికారులు 32, సివిల్ అధికారులు 10 తదితర ఉద్యోగాలు కల్పించింది.
12,553 మందికి కారుణ్యం..
సీఎం కేసీఆర్ సూచనల మేరకు కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ అమలుకు సంస్థ నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా 2014 నుంచి ఇప్పటి వరకు 85 మెడికల్ బోర్డులు నిర్వహించి అన్‌ఫిట్ అయిన కార్మికుల స్థానంలో 12,553 మంది వారసులకు ఉద్యోగాలు కల్పించింది. దీంతో సింగరేణి నేడు యువశక్తిని నింపుకొని నూతనోత్తేజంతో ముందుకు సాగుతున్నది.
ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా అర్హత గల ఉద్యోగాలు..
కారుణ్య, వారసత్వ నియామకాల ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతలో కొందరు, అలాగే సాధారణ కార్మికుల్లో కూడా అదనపు విద్యార్హతలు గలవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలో ఏర్పడే కొత్త ఖాళీలను అర్హులైన ఇంటర్నల్ అభ్యర్దులతో భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,909 మంది అర్హులైన ఇంటర్నల్ అభ్యర్థులకు వారి అర్హతకు తగిన ఉద్యోగాలు ఇచ్చింది.
ఇకపైనా కొనసాగుతాయి..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సంస్థ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్, కారుణ్య నియామకాల ద్వారా 16,051 కొత్త ఉద్యోగాలు కల్పించాం. ఖాళీలను కొత్త నియామకాల ద్వారా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాం. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ ద్వారా ప్రతి నెలా సగటున 250 మంది వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఎక్స్టర్నల్, వారసత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ ఇకపైనా ఇలానే
కొనసాగిస్తాం.