
దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా
3400 దరఖాస్తులు.. 1465 మంది హాజరు..
సమయాన్ని వృథా చేయకండి..
దేశానికి ఆదర్శంగా నిలవండి
యువతకు సీపీ అంజనీకుమార్ దిశానిర్దేశం
చాంద్రాయణగుట్ట, నవంబర్ 27 : దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం చాంద్రాయణగుట్ట ఓఎస్ ప్యాలెస్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. పాతబస్తీలో నివసించే నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. అనుభవం, విద్యార్హత ఆధారంగా 20 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మొత్తం 3400 మంది దరఖాస్తులు చేసుకోగా, 1465 మంది హాజరయ్యారు. 299 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి సీపీ అంజనీకుమార్ నియామక పత్రాలను అందజేశారు.
మూడేండ్లలో 21 వేల మందికి..
నగర యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరై జాబ్‌మేళాను ప్రారంభించిన ఆయన యువతకు దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. మూడేండ్లలో 21 వేల మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించామన్నారు. చదువులు పూర్తి చేసిన యువతీ, యువకులు సమయం వృథా చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మంచి ఉద్యోగాలు దక్కించుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్, దక్షిణ మండల డీసీపీ గజారావు భూపాల్, అదనపు డీసీపీ సయ్యద్ రఫీక్, ట్రాఫిక్ డీసీపీ రాములు, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్ వర్మ, నవీన్‌కుమార్, టీఎంఐ గ్రూప్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.