
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయోగశాల ఆ పాఠశాల. కేవలం చదువే కాకుండా డ్యాన్స్, వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, జానపద నృత్యం, కవితల పోటీలు.. ఇలా ఒకటేమిటి ఏ పోటీలు జరిగినా విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న అంశంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విద్యాశాఖ నిర్వహించే పోటీల్లో పాల్గొని మం డల, జిల్లా, రాష్ట్రస్థాయికి ఎంపికవుతున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తున్న మెదక్ జిల్ల్లా పాపన్నపేట
మండలంలోని కుర్తివాడ ఉన్నత పాఠశాలపై ప్రత్యేక కథనం..
పాపన్నపేట, జనవరి 9 : మెదక్ జిల్లా పాపన్నపేట మం డలం కుర్తివాడ ఉన్నత పాఠశాలలో 245 మంది విద్యార్థులు ఉన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో బోధన కొనసాగుతున్నది. చదువుతో పాటు విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో పాఠశాల పునఃప్రారంభం కాగా, ఇప్పటి వరకు జరిగిన అనేక పోటీల్లో విద్యార్థులు మండల, జిల్లాస్థాయిలో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. సెప్టెంబర్‌లో జరిగిన స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.కొవిడ్ రహిత పాఠశాలగా ఉండేందుకు వ్యక్తిగత అవగాహన కల్పించి డీఈవో రమేశ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటకశాఖ నిర్వహించిన చిత్రలేఖన పోటీలో ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థిని భవానీ విజేతగా నిలిచింది. అటవీశాఖ వారు నిర్వహించిన ‘ప్రకృతితో మమేకం’ అనే అంశంపై చిత్రలేఖనంలో మేరీ అనే విద్యార్థిని ప్రథమ స్థానం దక్కించుకోగా, ‘వన్యప్రాణులను ఎలా సంరక్షించాలి’ అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచనపోటీలో స్రవంతి ప్రథమ స్థానం దక్కించుకున్నది. అక్టోబర్‌లో కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనిర్వహించిన ‘వ్యర్థరహిత ప్లాస్టిక్ లేని భవిష్యత్’ అనే అంశంపై తెలుగులో నిఖిత, హిందీలో నవాజ్ ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అక్టోబర్ చివరి వారంలో నిర్వహించిన జిల్లా స్థాయి కళాఉత్సవ్‌లో చిత్రలేఖనంలో భవానీ ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయికి ఎంపికైంది. కళా ఉత్సవ్‌లో జానపద నృత్య పోటీలో వైష్ణవి ద్వితీయ స్థానం, శాస్త్రీయ పాటల పోటీలో సాహితీ ద్వితీయ స్థానం, శాస్త్రీయ నృత్య పోటీలో ప్రియశ్రీ తృతీయ స్థానం సంపాదించారు. వారధి ఫౌండేషన్ నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో భవానీ మండల స్థాయిలో ప్రథమ స్థానం పొంది జిల్లా స్థాయికి ఎంపికైంది. అక్షర సేద్యం ఫౌండేషన్ ప్రకటించిన రెండు తెలుగు రాష్ర్టాల బాలల కవితల పోటీల్లో స్రవంతి రాసిన ఆడపిల్ల కవిత, మేరీ రాసిన ప్రకృతి కవితలకు స్థానం దక్కింది.
మెళకువలు నేర్పిస్తారు..
ఎలాంటి పోటీలు జరిగినా పాల్గొనేలా మమ్మల్ని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో గెలుపొందేందుకు మెళకువలు నేర్పిస్తారు. కళాఉత్సవ్‌లో చిత్రలేఖన పోటీలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది.
-భవానీ, పదో తరగతి
సంతోషంగా ఉంది..
జరుగబోయే పోటీల గురించి ఉపాధ్యాయులు మాకు చెబుతారు. ఎలా రాయాలో శిక్షణ ఇస్తారు. మాకు అనేక విషయాలపై అవగాహన కల్పిస్తారు. విద్యార్థినుల్లో స్ఫూర్తిని నింపుతారు. కలెక్టర్ చేతల మీదుగా బహుమతి అందుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి అవకాశం రావడం సంతోషంగా ఉంది.
-స్రవంతి, పదో తరగతి
ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది..
ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక సృజనాత్మకత ఉంటుంది. పోటీలు జరిగినప్పుడు వారిని ప్రోత్సహిస్తాం. ప్రతి పోటీకి ఒక ఉపాధ్యాయుడు ఇన్చార్జిగా ఉంటారు. వారు విద్యార్థుల సృజనాత్మకతను పెంచే దిశగా మెరుగులు దిద్ది పోటీలకు సిద్ధం చేస్తారు. ఇప్పటి వరకు అనేక పోటీల్లో విద్యార్థులు విజేతలుగా నిలువడం గర్వంగా ఉంది.
-అంజాగౌడ్, ప్రధానోపాధ్యాయుడు