త్వరలోనే నెరవేరనున్న పేదల సొంతింటి కల
తూర్పులో జీ ప్లస్త్రీ పద్ధతిలో 2,200 ఇండ్లు మంజూరు
దూపకుంట వద్ద ఒకేచోట రెండువేల ఇళ్ల నిర్మాణం
చివరి దశలో 1,400… వివిధ దశల్లో మరో 600
దేశాయిపేటలో శరవేగంగా మరో 200 గృహాల నిర్మాణం
సమీక్షలతో పనులను పరుగెత్తిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని
వరంగల్, డిసెంబర్ 24(నమస్తేతెలంగాణ) : వరంగల్ తూర్పులో పేదల సొంతింటి కల సాకారం కాబోతున్నది. ఇక్కడ వేర్వేరు ప్రదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2,200 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నది. వీటిలో దూపకుంట వద్ద ఒకేచోట రెండు వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే కొన్నింటి నిర్మాణం చివరి దశకు చేరింది. మరికొన్ని స్లాబు దశలో, ఇంకొన్ని గోడలు, బేస్మెంటు దశల్లో ఉన్నాయి. కరోనా కారణంగా కొంతకాలం ఆగిపోయిన పనులు కొద్దినెలల నుంచి శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.
పేదల కోసం సీఎం కేసీఆర్ సకల సౌలత్లతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. అవసరమైన నిధులను ప్రభుత్వమే కేటాయిస్తున్నది. ప్రభుత్వ స్థలాల్లో వీటి నిర్మాణం చేపట్టి రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నది. నిర్మాణం పూర్తయ్యాక ఇల్లు లేని పేదలకు పారదర్శకంగా కేటాయిస్తున్నది. పేదలకు సొంతిల్లు కోరిక తీర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసింది.
మూడు విడుతలుగా..
జిల్లాలో వరంగల్తూర్పు శాసనసభ నియోజకవర్గానికి కేటాయించిన 2,200 డబుల్ బెడ్రూం ఇండ్లలో ప్రభుత్వం ఇక్కడి దూపకుంట వద్ద 2 వేలు, దేశాయిపేట వద్ద 200 ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన అనుమతులు ఇచ్చింది. దూపకుంట వద్ద ఒకేచోట మూడు విడుతలుగా రెండు వేల ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. ఈ స్థలంలో తొలి విడుత 400, రెండో వి డుత 1,000, మూడో విడుత 600 ఇండ్ల నిర్మాణ ప నులను జీ ప్లస్ త్రీ పద్ధతిలో చేపట్టారు. ఒక్కో బ్లాక్లో 16 నుంచి 32 ఇండ్లు ఉండేలా నిర్మిస్తున్నారు. తొలి విడుతకు సంబంధించి 120 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. 280 ఇండ్లకు పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. రెండో విడుతలో 450 ఇండ్ల స్లాబు పడిం ది. 150 ఇండ్ల గోడల నిర్మాణం జరుగుతుండగా, మ రో 400 ఇండ్ల నిర్మాణం బేస్మెంట్ స్థాయిలో ఉంది. మూడో విడుతలో 280 ఇండ్ల స్లాబు పడింది. 56 ఇండ్ల బేస్మెంట్ పూర్తి కాగా, మరో 32 ఇండ్ల నిర్మాణ పనులు బేసిమెంట్ దశలో ఉన్నాయి. మిగతా ఇండ్ల ని ర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. తొలి, రెండో విడత చేపట్టిన ఇండ్ల నిర్మాణాన్ని వచ్చే మార్చి నెలాఖరులోగా నూరు శాతం పూర్తి చేయాలని అధికారులు ల క్ష్యంగా నిర్దేశించుకున్నారు. దూపకుంట వద్ద ఒకేచోట నిర్మిస్తున్న రెండు వేల ఇండ్ల నిర్మాణం పూర్తయితే ఇది ‘డబుల్’ సిటీ కానుంది. ఇండ్ల నిర్మాణంపై స్థానిక ఎ మ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో స్పీడ్ పెంచుతున్నారు.
దేశాయిపేట వద్ద..
వరంగల్ దేశాయిపేట లక్ష్మీమెగాటౌన్షిప్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో మరో 200 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. ఇక్కడి జర్నలిస్టుల కోసం ప్రభుత్వం వీటిని నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని ప్రకటించారు. జీ ప్లస్త్రీ పద్ధతిలో ఇండ్ల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇప్పటికే వీటిలో 24 ఇండ్ల స్లాబు పడింది. మరో 120 ఇండ్ల నిర్మాణ పనులు బేస్మెంట్ దశలో, ఇంకో 56 ఇండ్ల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇటీవల పలుమార్లు ఎమ్మెల్యే సందర్శించి పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులకు చెప్పారు. దూపకుంట, దేశాయిపేట వద్ద చేపట్టిన ఇండ్ల నిర్మాణ పనులను ఆర్అండ్బీ ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. వీటి నిర్మాణంపై డీఆర్డీవో సంపత్రావు వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయ పరుస్తున్నారు. వరంగల్ నగరంలో ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.30 లక్షలు మంజూరు చేసింది. మౌలిక వసతుల కోసం మరో రూ.75 వేలు కేటాయిస్తున్నది. దూపకుంటలో నిర్మాణ పనులు తుది దశకు చేరిన 400 ఇండ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు ఒక్కో ఇల్లుకు రూ.75 వేల చొప్పున మంజూరు చేసింది.