
ప్రి బిడ్ సమావేశంలో హెచ్ఎండీఏ సెక్రెటరి సంతోష్
సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్లాట్ల వేలాన్ని ఆన్లైన్లో ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్లను అప్పగిస్తామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సంతోష్ పేర్కొన్నారు. బేగంపేటలోని ది ప్లాజా హోటల్లో ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్లాట్ల వేలానికి సంబంధించి ప్రి బిడ్ మీటింగ్‌ను శనివారం నిర్వహించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న డెవలపర్ల విజ్ఞప్తి మేరకు ఉప్పల్ భగాయత్ వెంచర్‌లోని 44 ప్లాట్ల విక్రయానికి సంబంధించి అవసరమైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు వారి సందేహాలను హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ కె.గంగాధర్, ఓఎస్డీ ఎం.రాంకిషన్‌లు నివృత్తి చేశామన్నారు. ప్రస్తుతం 44 ప్లాట్లకు డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆన్లైన్ వేలం జరిపేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయన్నారు. ఇప్పటికే ఉప్పల్ భగాయత్ లే అవుట్లో అనేక బహుళ అంతస్థుల భవనాలతో నిర్మాణంలో ఉన్నాయని, ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. వేలంలో పాల్గొని ఎక్కువ ప్లాట్లను కైవసం చేసుకునేందుకు వీలుగా కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వేలం ప్రక్రియను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ అధికారులు రేణు పురుషోత్తం, ఉమేష్ చంద్రలు వివరించారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం నిర్వహిస్తే మంచి స్పందన వచ్చింది. హెచ్ఎండీఏ చేస్తున్న లే అవుట్లు క్లియర్ టైటిల్‌తో ఉండటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే నమ్మకం కొనుగోలు దారుల్లో ఉందన్నారు.
వ్యాపార సంస్థలకు అనుగుణంగా విస్తీర్ణం
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు, హోటల్స్‌కు, విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, వినోద కేంద్రాలకు అనుగుణంగా ఉండేలా 5 వేల గజాల విస్తీర్ణంలో ప్లాట్లను అభివృద్ధి చేశామని చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి తెలిపారు. గత నెల రోజుల్లో 1500 మంది ప్లాట్ల వేలం కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను వీక్షించారన్నారు. గూగుల్‌మ్యాప్ ద్వారా వెంచర్‌ను చూసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్, ఈఎండీ, చెల్లింపులు, ప్లాట్ రాని పక్షంలో ఈఎండీ తిరిగి చెల్లించడం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్ వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారికి ఒకటి రెండు రోజుల్లో ఇంటిమేషన్ లెటర్స్ అందజేస్తామని, 25శాతం చెల్లిస్తే హెచ్ఎండీఏ నుంచి ఎన్ఓసీ ఇస్తామని, దాని ఆధారంగా మిగతా 75 శాతం నిధులను నాలుగు బ్యాంకులైన ఇండియన్ ఓవర్సీస్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి సమకూర్చుకునే అవకాశం ఉందన్నారు. పది శాతం వడ్డీతో హెచ్ఎండీఏ వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చని తెలిపారు.