ఎంతో ఆనందంగా వివాహ వేడుకకు వెళ్తున్న ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సంఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న చిన్నారి మృతి చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం శాబ్ధిపూర్ వద్ద చోటు చేసుకున్నది. బాధితులు నిజామాబాద్ నగరానికి చెందినవారు.
కామారెడ్డిరూరల్,19 డిసెంబర్ : ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన సంఘటనలో కూతురు మృతి చెందగా తల్లిదండ్రులు గాయపడ్డ సంఘటన కామారెడ్డి జిల్లా శాబ్ధిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ ప్రాంతానికి చెందిన నాగరాజు-రేఖ దంపతులు కూతురు వైభవి(8)తో కలిసి ద్విచక్రవాహనంపై సిద్దిపేట జిల్లాలోని అల్వాల్ ప్రాంతానికి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం బయలుదేరారు. వీరి వాహనం కామారెడ్డి మండలం శాబ్ధిపూర్ శివారులోని జాతీయ రహదారి వద్దకు రాగానే అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ముందు కూర్చున్న వైభవి అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఈ ప్రమాదంలో నాగరాజు-రేఖ తీవ్రం గా గాయపడ్డారు. స్థానికులు గమనించి వీరిని కా మారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. రోడ్డుపై వాహనాన్ని నిలిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై రవికుమార్ తెలిపారు.