
మర్రిగూడ, డిసెంబర్ 23 : రైతులకు మేలు చేసే హార్టికల్చర్ విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సూచించారు. గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామభారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మర్రిగూడ గ్రామానికి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఇక్కడి వాతావరణం చాలా బాగుందన్నారు. పుదుచ్చేరి రాష్ట్రంలో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నందున ఒక్కరోజు ముందే కార్యక్రమం నిర్వహించినప్పటికీ చాలామంది రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ, ఉద్యానరంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యానరంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2021-22గాను రూ.2250కోట్ల నిధులు కేటాయించి ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. హరితాహరంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చెట్లను నాటి పచ్చదనాన్ని పెంపు అభినందనీయమన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ,ఉద్యానవన రంగాలకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాతలు, స్థానిక ప్రజలు కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కరోనా థర్డ్‌వేవ్ పొంచి ఉన్నందున ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారా అని గవర్నర్ సభలో అడగ్గా ఎదురుగా ఉన్నవారంతా చేతులెత్తారు. మర్రిగూడలో 95శాతం ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడంపై గవర్నర్ అభినందించారు. పండుగల సందర్భంగా ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా సభకు వచ్చిన వారికి క్రిస్మస్, న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రాహల్‌శర్మ, చంద్రశేఖర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్,కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బోగా నీరజాప్రభాకర్, జిల్లా ఉద్యాన శాఖాధికారి సంగీతలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ గోపీరాంనాయక్, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, తాసీల్దార్ జి.దేశ్యానాయక్, ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్, సర్పంచ్ యాద య్య, ఎంపీటీసీ వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.