
అరకొర తరగతి గదులు.. మైదానాల కొరతతో తల్లడిల్లిన సర్కార్ బడులకు తెలంగాణ ప్రభుత్వం ఊపిరిపోసింది. సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దింది. ఒంటికి, రెంటికి ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కించింది. మధ్యాహ్న భోజనం వండేందుకు వంట గదులు లేక పొగచూరిన జీవితాలకు ఉపశమనం కల్పించింది. చెట్ల కింద చదువులకు స్వస్తి చెప్పి విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. వారికి పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నది. అంతేకాదు, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ ఆలోచన వదిలి సర్కార్ బడికి పంపిస్తున్నారు. ఇక్కడ చదువుతోపాటు క్రీడలకు పెద్దపీట వేస్తుండడంతో విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో తర్ఫీదు పొందు తున్నారు. కొవిడ్ సమయంలోనూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు బోధించారు. రెండేళ్ల నుంచి సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కూసుమంచి, డిసెంబర్ 18: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు జవ సత్వాలు వచ్చాయి. రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైన విద్య అందిస్తుండడంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఇష్టపడుతున్నారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొవిడ్ సమయంలోనూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు బోధించారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో సర్కార్ పాఠశాలల్లో కొత్తగా చేరిన వారి సంఖ్య 20,567కు చేరింది.
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలవుతున్నది. ఎంఈవోలు, హెచ్ఎంలు, పాఠశాల కమిటీ సభ్యులు నిత్యం మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలిస్తున్నారు. రోజు విడిచి రోజు విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నారు. భోజనంలో ఆకు కూరలు, పప్పు, కూరగాయలు ఉండేలా చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 95శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్నే తింటున్నారు. అందరూ కలిసి భోజనం చేయడానికి పాఠశాలల్లో సువిశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన ఆదరణ..
కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో జిల్లాలోని 1,326 పాఠశాలలకు 1,325 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కొత్తగా బాలికలు 9,290 మంది, బాలురు 11,277 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను వదిలిపెట్టి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఉదాహరణకు కూసుమంచి మండలంలోని పాలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో కొవిడ్‌కు ముందు విద్యార్థుల సంఖ్య కేవలం 25 మాత్రమే. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్ వెళ్లారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 130కి చేరింది. దీంతో ఉపాధ్యాయులు తిరిగి పాలేరు పాఠశాలకు వచ్చారు. ఇలాంటి పరిస్థితి ఒక్క పాలేరు పాఠశాలలోనే కాదు జిల్లాలోని వందలాది పాఠశాలల్లో కనిపిస్తున్నది. ఇప్పుడు సర్కారు పాఠశాలలన్నీ విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
నాణ్యమైన విద్యపై దృష్టి..
కొవిడ్‌కు ముందు మా పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 280కు చేరింది. ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించారు. వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. కొవిడ్ సమయంలోనూ ఆన్లైన్ క్లాసులు బోధించాం. విద్యార్థులు బాగా చదువుతున్నారు. వారిపై శ్రద్ధ తీసుకుంటున్నాం.
విద్యార్థుల సంఖ్య పెరిగింది..
కరోనా కారణంగా సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలుత మూతపడ్డాయి. పిల్లల చదువు ఆగకూడదని ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం అనుకున్న తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించారు. మా పాఠశాలలో గతేడాది విద్యార్థుల సంఖ్య 320 మంది ఉండగా ఈ ఏడాది ఏకంగా 402కు చేరింది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం నానాటికీ పెరుగుతున్నది.
విద్యార్థులకు నాణ్యమైన విద్య..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఉపాధ్యాయులు సీసీఎస్ పద్ధతిలో బోధిస్తున్నారు. పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. మెనూ పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.