మాక్లూర్, డిసెంబర్ 18: బంతిపూల సాగు వాణిజ్యపరంగా మంచి విలువను కలిగి ఉన్నది. పూలతోటల పెంపకంతో సన్న, చిన్నకారు రైతులు మంచి లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పూలను పండుగల సమయంలో, వివిధ వేడుకల్లో అలంకరణ కోసం విరివిగా వినియోగిస్తారు. అందుకే బంతి ఆదాయానికి పూలబాట వంటిది. అలాంటి బంతిపూలను నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మాదాపూర్, గుత్ప, మాక్లూర్, రామచంద్రాపల్లి గ్రామాలకు చెందిన రైతులు సాగు చేస్తున్నారు. వివిధ కాలాల్లో వచ్చే శుభకార్యాలను దృష్టిలో పెట్టుకొని కొందరు రైతులు సీజన్లో పంటలు చేతికందేలా సాగుచేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. అందులో భాగంగానే పూల తోటల పెంపకంపై ఆసక్తిని చూపుతున్నారు. తక్కువ నీటి వినియోగంతోపాటు, అనుకూలంగా లేని నేలల్లో ఆరుతడి పంటలు పండిస్తూనే పూలతోటలను పెంచుతూ అధిక లాభాలను పొందవచ్చనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఆదర్శం ఈ రైతు..
మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు శ్రీనివాస్‌రావు ఎకరం భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో బంతి, గలాండా, చాందినీ, ఆల్ కలర్స్ పూలతోటలను పెంచి ఆర్మూర్, నిజామాబాద్‌లోని మార్కెట్‌కు తరలిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందెడ్ నుంచి గలాండ, చాందినీ, బంతి నారు, బెంగుళూర్, ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి నుంచి ఆల్కలర్స్ నారును తీసుకువచ్చి పూల తోటలను పెంచాడు. ఎకరానికి 50 వేల రూపాయలను నారు(ట్రాన్స్‌పోర్టు), దుక్కి, కూలీలకు ఖర్చు చేస్తున్నాడు. నారు వేసిన అనంతరం మొక్కలు పెరిగే వరకు మాత్రమే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాడు. నీటి పారకం వారానికి రెండుసార్లు, గాలి, వర్షం, వేడి వాతావరణ పరిస్థితులను తట్టుకునేది బంతి పంట మాత్రమేనని తెలిపారు. బంతి వారానికోసారి, చాందినీ రెండు వారాలకు మూడు సార్లు, గలాండ, ఆల్కలర్స్ పూలు వారానికి రెండుసార్లు కోతకు వస్తాయని తెలిపారు. మార్కెట్లో బంతి, గలాండ, చాందినీ కిలోకు రూ.50, ఆల్కలర్స్ కిలోకు రూ.100 ధర పలుకుతున్నాయి. నల్లరేగడి నేలల్లో సైతం పూలసాగు చేయవచ్చని, నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని, మార్కెట్లో ధరను బట్టి రోజుకు వెయ్యికి పైగా ఆదాయం వస్తుందని వివరించాడు. పండుగల వేళ ఆదాయం రెట్టింపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నాటడం నుంచి పూలు కోసే వరకు ఎకరానికి రూ.50వేలు ఖర్చు చేస్తే లక్షకు పైగా ఆదాయం వస్తుందని, రెండు మూడు నెలల్లో ఎకరానికి 50వేలు సంపాదన వస్తుందని అన్నారు.
ఆరుతడి పంటగా పూలతోటలు..
ఆరుతడి పంటగా రైతులు పూల తోటలను సాగు చేస్తే బాగుంటుంది. నీటి పారకం ఇబ్బందులు ఉండవు. ఒకసారి సాగు చేస్తే కోత అయ్యేంత వరకు ఇబ్బందులుండవు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. పూలు కోయడానికి కేవలం కూలీలు దొరికితే చాలు. రసాయన మందుల వాడకం ఉండదు. పూలకు మంచి మార్కెట్ ఉంటుంది.