ఫర్టిలైజర్ సిటీ, డిసెంబర్ 28: స్నేహితుడి పుట్టినరోజుకని ముగ్గురు యువకులు సరదాగా ఒకే బైక్‌పై వెళ్లారు. రాత్రి 11 గంటలవరకు వస్తానని ఇంట్లో చెప్పారు. వేడుకలు ముగించుకొని అర్ధరాత్రి దాటాక బయలుదేరారు. అతి వేగంగా వచ్చి గోడను ఢీకొన్నారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు హాస్పిటల్‌కు తరలించేలోపే మృత్యువాతపడ్డారు. ఇంకొకరు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గోదావరి ఖని పట్టణంలో జరుగగా కన్నబిడ్డల కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. గోదావరిఖని మల్లికార్జున్ నగర్‌కు చెందిన బక్కతట్ల పోచయ్య కుమారుడు ఉమా మహేశ్వర్ (19) వరంగల్‌లో డిగ్రీ చదువుతున్నాడు. మూడు నెలల క్రితం ఉమా మహేశ్వర్‌కు తండ్రి కేటీఎం బైక్ కొనిచ్చాడు. సోమవారం రాత్రి విఠల్‌నగర్‌లోని తన స్నేహితుడి పుట్టిన రోజుకని మరో ఇద్దరు స్నేహితులు శివరాం, సిద్ధును తీసుకొని వెళ్లాడు. ఉమా మహేశ్వర్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో పోచయ్య భార్య రాత్రి ఫోన్ చేయగా 11 గంటల వరకు వస్తానని చెప్పాడు. బర్త్‌డే వేడుకలు ముగించుకొన్న స్నేహితులు తిరిగి బయలుదేరారు. శివరాం వాహనం నడుపుతుండగా సిద్ధు మధ్యలో, ఉమా మహేశ్వర్ వెనుకాల కూర్చున్నాడు. వీరు అర్ధరాత్రి దాటిన తర్వాత అతివేగంగా వచ్చి రమేశ్‌నగర్ చౌరస్తాలోని వెంకటేశ్వర సైకిల్ షాపు గోడను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శివరాం తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకాల కూర్చున్న ఉమా మహేశ్వర్‌ను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. సిద్ధుకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయిస్తున్నారు. ఉమామహేశ్వర్ తండ్రి పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాజుకుమార్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను గోదావరిఖని సర్కారు దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. హాస్పిటల్ ఆవరణలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..
ఓదెల, డిసెంబర్ 28: పెద్దపల్లి జిల్లా కనగర్తి-మడక గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసరి అనిల్‌కుమార్ (26) అనే యువకుడు మృతి చెందాడు. పొత్కపల్లి ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ సోమవారం మడక గ్రామంలో తమ బంధువు అంత్యక్రియలకు వచ్చాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో బైక్‌పై వెళ్తుండగా కనగర్తి గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే సుల్తానాబాద్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.