భద్రాచలం/ పర్ణశాల, జనవరి 3: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సోమవారం భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకలను దేవస్థానం ఈవో శివాజీ సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మత్స్యావతారంలో రామయ్య తండ్రిని అలంకరించి భక్తుల దర్శనార్థం బేడా మండపంలో ఉంచారు. స్వామివారి ఉత్సవమూర్తులను, ఆండాళ్ తల్లిని, శ్రీకృష్ణ పరమాత్మను, 12 మంది ఆళ్వార్లను బేడా మండపంలో ఉంచి ఆండాళ్ అమ్మవారికి పాశుర విన్నపం చేశారు. సోమవారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు ముత్యాలు పొదిగిన ప్రత్యేక తొడుగులను ధరింపజేశారు.
రుత్విక్లకు దీక్షా వస్ర్తాల పంపిణీ..
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులకు, అలంకారమూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. 28 మంది రుత్విక్లకు ఆలయ ఈవో దీక్షా వస్ర్తాలు పంపిణీ చేశారు.
మత్స్యావతారంలో..
స్వామివారి నిత్యకల్యాణమూర్తులను మత్స్యావతారంలో అర్చక స్వాములు సుందరంగా అలంకరించి బేడా మండపంలో ఉంచారు. రామయ్యకు దివ్యాభరణాలు అలంకరించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు జరిపారు.
నేడు కూర్మావతారం..
దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో ఏ ఆధారం లేక మంధర పర్వతం మునిగిపోతుంది. దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి, మునిగిపోయిన పర్వతాన్ని తన వీపున నిలిపి పైకెత్తుతాడు. అదే కూర్మావతారం. మంగళవారం స్వామివారు కూర్మావతారంలో దర్శనమిస్తారు.
పర్ణశాలలో..
పర్ణశాలలోనూ రామయ్య మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. శ్రీమహావిష్ణువు ధరించిన అవతార వరుసలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారమని అర్చకులు వివరించారు.
తిరువీధి సేవల నిలిపివేత
ఒమిక్రాన్ దృష్ట్యా తిరువీధి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భద్రాద్రి దేవస్థానం జనవరి 1 నుంచి 10 వరకు కొవిడ్ నిబంధనల ప్రకారం భద్రాచలం, పర్ణశాల దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే తిరువీధి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసింది. 11న తదుపరి ఉత్తర్వుల మేరకు ఉత్సవాల నిర్వహణ వివరాలను తెలియజేస్తామని ఈవో బానోత్ శివాజీ తెలిపారు.