
అడ్డగూడూరు, జనవరి 8 : ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం ఆనంతరం పట్టణాలకు ధీటుగా పల్లెలోనూ సాగు, తాగునీటి సౌకర్యం పెరుగడంతో భూములకు డిమాండ్ పెరిగింది. రహదారుల విస్తరణతోపాటు విద్య, వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతుండడంతో భూముల కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. పట్టణాలకు వలస వెళ్లిన వారు ఆర్థికంగా స్థిరపడడంతో పుట్టిన ఊళ్లలో ఆస్తుల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. దాంతో ధరలకు రెక్కలొచ్చాయి. వలిగొండ నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి మంజూరు కావడంతో మండలంలోని కంచనపల్లి, బొడ్డుగూడెం,చౌళ్లరామారం,చిర్రగూడూరు గ్రామాల్లో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. బొడ్డుగూడెం-చౌళ్లరామారం గ్రామాల మధ్య టోల్‌ప్లాజా ఏర్పాటుకు స్థల పరీశీలన సైతం పూర్తి కావడంతో ఈ గ్రామంలో భూమి దొరకని పరిస్థతి నెలకొంది. మండలకేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో గజం ధర రూ. రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతున్నది.
వ్యవసాయ భూముల కొనుగోలుపై ఆసక్తి..
మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలుపై పట్టణ, నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. కొందరు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. ఎకరాని రూ.30 -40 లక్షల వరకు ధర పలుకుతున్నది.
భూముల ధరలు పెరిగాయి..
ప్రభుత్వం అడ్డగూడూరును మండల కేంద్రంగా మార్చడంతో అభివృద్ధి ఊపందుకుంది. భూములకు భారీగా డిమాండ్ వచ్చింది. మానాయికుంట-గురజాల మధ్య రూ.18కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయితే ఇక్కడి నుంచి శాలిగౌరరం, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరకల్, సూర్యాపేట రాకపోకలకు చాలా సులభంగా ఉంటుంది. భూముల ధరలు మరింత పెరుగనున్నాయి. రోడ్డు వెంట భూములు రూ.40 లక్షల వరకు పలుకుతున్నాయి.
ఇండ్ల స్థలాలు దొరకడం లేదు..
ఇండ్ల స్థలాలు కొనలాంటే ఇబ్బందిగా ఉంది. మండలం ఏర్పడిన నాటి నుంచి భూముల ధరలు బాగా పెరిగాయి. చౌళ్లరామారం వద్ద టోల్‌ప్లాజా ఏర్పాటు కానుండడంతో ఇక్కడ భూములు భారీగా ధర పలుకుతున్నాయి. గ్రామాల్లోనూ సౌకర్యాలు పెరుగడంతో భూములు దొరకడం లేదు. ధర ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు చాలామంది పోటీ పడుతున్నారు.