ఖలీల్‌వాడీ/ ఆర్మూర్/ పిట్లం, డిసెంబర్ 15: హైదరాబాద్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి కొవిడ్, సాధారణ మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు బుధవారం ఆర్థిక సాయం అందజేశారు. కొవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున, సాధారణ మరణం చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఉమ్మడి జిల్లా నుంచి తొమ్మిది జర్నలిస్టు కుటుంబాలు ఆర్థిక సాయం చెక్కులను అందుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులు డి.అశోక్, ఏ.జ్ఞానేశ్వర్, సి.విఠల్, కే.వేణుగోపాల్, ఏ.శేఖర్, ఆర్. రాజేశ్వర్ కొవిడ్‌తో మృతి చెందగా, ఎస్.బాలాగౌడ్, బీ.కృష్ణ, ఇర్ఫాన్ అహ్మద్‌ఖాన్ అనారోగ్యంతో మృతి చెందారు. వీరి కుటుంబాలకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూ డబ్ల్యూజేయూ (ఐజేయూ) సభ్యులు అంగిరేకుల సాయిలు, రాజేశ్, ప్రసాద్, మోహన్, శేఖర్, దస్తాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.