ముషీరాబాద్ : దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే ప్రొత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందు లకు గురి చేస్తుందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అన్నారు. కార్పొరేట్ కల్చర్‌ను ప్రోత్సహిస్తూ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న ఇందిరాపార్కు వద్ద నిర్వహించతలపెట్టిన ధర్నా ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యేలతో కలిసి వారు పరిశీలించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఇందిరాపార్కుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా చేపడుతున్న ధర్నాలో ప్రతిఒక్కరూ పాల్గొని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి 24 గంటల కరెంటు, నీళ్లు, పెట్టుబడి, బీమా కల్పించడంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి వ్యవసాయాన్ని సస్యశామలం చేశారని అన్నారు. దేశంలోనే పంటల దిగుబడిలో తెలంగాణరాష్ట్రం రెండవ స్థానం లో నిలిస్తే కేంద్రం రైతులకు అండగా నిలవకుండా గందరగోళానికి గురి చేస్తుందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు వరి ధాన్యం కోనబోమని చెప్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తూ రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన తీసుకువచ్చిన నల్ల చట్టాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ విధానాలు, అమలు తీరు ఎలా ఉంటుందో కనీస అవగాహన లేకుండా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడు తున్నారని, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షాలు, కలిసి వచ్చే వారిని ఏకం చేసి కేంద్రం దిగి వచ్చి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పార్లమెంటు శీతకాల సమావేశాల్లో టీఆర్ఎస్ కేంద్ర రైతు వ్యతిరేక చర్యలను ఎండగడుతుందని చెప్పారు. 12న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చౌక్‌లో వేలాది మందితో ధర్నా చేపడతామని తెలిపారు. రైతు సంఘీభావ ధర్నాలో నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ఎంఎన్.శ్రీనివాసరావు, మోతే శోభన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్ రాథోడ్, ఆనంద్ గౌడ్, కిశోర్‌గౌడ్, క్రిష్ణగౌడ్, వల్లాల శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.