జహీరాబాద్/న్యాల్కల్, జనవరి 8 : కర్ణాటక, మహారాష్ర్టాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులో కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని చిరాగ్పల్లి, న్యాల్కల్ మండలంలోని హుస్సేల్లి శివారులో పోలీసు, వైద్య సిబ్బంది చెక్‌పోస్టులు ఏర్పా టు చేసి తనిఖీలు చేస్తున్నారు. శనివారం 65వ జాతీ య రహదారి పై చిరాగ్పల్లి శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది అక్కటి నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా, ఒమిక్రాన్ వైరస్ పరీక్షలు చేసి ఫలితాలు చూసి పంపిస్తున్నారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అక్కడ ప్రభు త్వం వీకెండ్ లాక్డౌన్ విధించింది. శుక్రవారం రాత్రి 10గంటల నుంచి సోమవారం తెల్లవారు జాము 5గంటల వరకు వీకెండ్ లాక్‌డౌన్‌తో పాటు రాత్రి కర్ఫ్యూ విధించింది. దీంతో అక్కడి వారు షాపింగ్ చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అక్కడి వారు తెలంగాణలోకి రావడంతో కేసులు పెరిగే ప్రమాదముందని అధికారులు సరిహద్దులో కఠిన నింబంధనలు అమలు చేస్తున్నారు. సరిహద్దులో చిరాగ్పల్లి, హద్నూర్ ఎస్సైలు కాశీనాథ్, వినాయ్కుమార్ పర్యవేక్షణ చేస్తున్నారు. 24 గంటలు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించేందుకు అధికారులు సిబ్బందిని నియమించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారికి పరీక్షలు చేసి, అనుమతి ఇవ్వడంతో కేసులు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్ రూరల్ సీఐ భరత్‌కుమార్ ఆధ్వర్యంలో హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్, ఏఎస్సై ఈశ్వర్, హెడ్‌కానిస్టేబుల్ పుండ్లీక్, పోలీసులు మండలంలోని బీదర్-జహీరాబాద్, అల్లాదుర్గం-మెటల్‌కుంట, న్యాల్కల్-బీదర్, నారాయణఖేడ్ రోడ్డు మార్గాల్లో వాహనల తనిఖీలు చేపడుతున్నారు. మాస్క్‌లు ధరించని వాహనచోదకులు, ప్రయాణికులు, ప్రజలకు జరిమానాలను విధిస్తున్నారు.