క్షీరాభిషేకాలు, ముగ్గుల పోటీలు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలతో రైతుబంధు వారోత్సవాలు ఆరోరోజూ సంబురంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల, ఆకునూరు, లద్నూర్, మద్దూరుల్లో నిర్మించిన రైతు వేదికలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. గజ్వేల్‌లో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, తొగుటలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మిరుదొడ్డిలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ వారోత్సవాలను ఈనెల 14వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో వ్యాసరచన, చిత్రలేఖన, వక్తృత్వ పోటీలు నిర్వహించగా, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సంబురాల్లో పాల్గొనగా, మెదక్ పట్టణంలో ముగ్గుల పోటీలకు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల మహిళా, ఆదర్శ, ఉత్తమ రైతులను శాలువాలతో సన్మానించారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో వ్యవసాయశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, వ్యవసాయ మార్కెట్ల చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.
‘పెట్టుబడి సాయం’తోనే పత్తి సాగు చేశా..
రాయపోల్, జనవరి 9: గతంలో పెట్టుబడులు ఎల్లక అనేక ఇబ్బందులు ఉండేవి. ఎవుసం కోసం బయట మిత్తీలకు పైసలు తెచ్చి సాగు చేస్తే మిగిలేది ఏమీ లేకుండే. అటు నీళ్లు, ఇటు వచ్చీరాని కరెంట్‌తో కష్టాలు ఉండేవి. పంటలు సరిగ్గా పండక అప్పులపాలైన రోజులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే మా బతుకులు బాగుపడుతున్నాయి. నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఉన్న 6 ఎకరాలకు రైతు బంధు సాయం పైసలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. వాటితోనే పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం. సర్కారు వేసిన డబ్బులతోనే ఈసారి కూడా పత్తిపంట వేశాను. ఈ పథకం వచ్చిన తర్వాత బయట అప్పులు చేయగడం తగ్గిపోయింది. సర్కారు ఇచ్చే పైలసతోనే విత్తనాలు, ఎరువులు కొంటున్న సంతోషంగా పనులు చేసుకుంటున్నా. రైతులకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ పాలన ఎప్పటికీ కొనసాగాలి.