పర్ణశాల, డిసెంబర్ 31: రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తున్నది. అన్నదాతలు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నది. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. అందుకు కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు చేసింది. కొన్న ధాన్యానికి రైతుల బ్యాం కు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తున్నది. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తున్నది. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ప్రకటించడంపై రైతాంగం మండిపడుతున్నది. జిల్లాలో అత్యధికంగా వరి సాగ య్యే మండలాల్లో దుమ్ముగూడెం ఒకటి. ఏటా వానకాలంలో 20 వేల ఎకరాల వరకు వరి సాగవుతుంది. ఇక్కడి నేలలు వరికి మాత్రమే అనుకూలం అని, ఉన్నట్టుండి వరి సాగు చేయొద్దని చెప్పడంతో తాము సందిగ్ధావస్థలో ఉన్నామని రైతులు వెల్లడిస్తున్నారు.
ధాన్యానికి మద్దతు ధర..
నాకు ఐదెకరాల మాగాణి ఉంది. ఏటా నేను వానకాలం, యాసంగిలో వరి సాగు చేస్తాను. ఈ ఏడాది వానకాలంలోనూ వరి పంటే వేశాను. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాను. యాసంగిలోనూ వరి వేద్దామనుకున్నా. ఏం చేయాలో తెలియడం లేదు.
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
తెలంగాణ రైతులను కేంద్రం వరి సాగు చేయొద్దనడం అన్యాయం. వరి పండే మాగాణిలో వరి మాత్రమే సాగు చేయగలం. కేంద్రం ఈ విషయంపై పునరాలోచించాలి. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
బైరాగులపాడు బీజేపీకి ఉసురు తగులుతుంది..
సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. రైతుసంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్రం మాత్రం రైతులను పట్టించుకోవడం లేదు. యాసంగిలో ధాన్యం కొనలేమనిచెప్పడం దారుణం. బీజేపీకి రైతుల ఉసురు తగులుతుంది.