నారాయణపేట రూరల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని కేంద్రంలో బీజేపీ నాయకులు చెప్పేది ఒకటి.. రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పేది మరొకటని బీజేపీ బూటకపు మాటలు నమ్మి రైతులు మోసపోకుండా యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నయ పంటలు పండించి లబ్ధి పొందాలని పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని భైరంకొండ, పేరపళ్ల, జాజాపూర్ గ్రామాల్లో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా చేతులెత్తేయడం సిగ్గు చేటన్నారు. వానకాలంలో పండించిన పంటలను కొనుగోలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో చెప్పులు పెట్టి నిరీక్షించిన పరిస్థితి ఉండేదన్నారు.ప్రస్తుతంసీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు సమస్యలు లేకుండా ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నదన్నారు.రైతు కుటుంబంలో రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చి అండగా నిలుస్తుందన్నారు. రైతుల మేలు కోసం 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ రైతు వేదికను నిర్మించి రైతులకు అవగాహన కార్యక్రమం చేపడుతుందన్నారు. ఎమ్మెల్యే సీడీపీ నిధులతో రైతు వేదికల్లో కంప్యూటర్, ప్రొజెక్టర్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించబడుతుందన్నారు. కేంద్రం వరి కొనుగోలు చేయమని చెప్త్తే బీజేపీ రాష్ట్ర నాయకులు వరి వేయమని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు కాబట్టి ప్రత్యామ్నయ పంటలు పండించాలన్నారు.
బీజేపీ నాయకులపై ఆగ్రహం
మండలంలోని భైరంకొండ,పేరపళ్ళ రైతు వేదిక భవనాలపై ప్రధాని మోదీ బొమ్మలను తొలగించారని ఆరో పిస్తూ బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయ డంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వేదికల్లో కేంద్ర ప్రభుత్వం నిధులున్నాయనడం బీజేపీ నాయకుల మూర్ఖత్వమని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 100 శాతం ట్యాక్సుల రూపంలో చెల్లిస్తే దానిలో రాష్ర్టాలకు 41 శాతం మాత్రమే కేంద్రం ఇస్తుందని విషయం తెలియకుండా బీజేపీ నాయకులు వ్యవహరిస్తూ అధికార పార్టీ నాయకుల సహనాన్ని దెబ్బ తీస్తున్నారన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుందని, ఎవరైనా రైతుల జోలికివస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అనంతరం జాజాపూర్‌లోని రైతు వేదిక వద్ద మొక్క నాటారు.
కార్యక్రమంలో సర్పంచులు నర్సింహులు, శ్రీదేవిరవీందర్గౌడ్, సుగంధమ్మజగన్మోహన్రెడ్డి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకట్రాములుగౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుగుణ, ఎంపీటీసీలు శేఖర్, సుభద్రమ్మ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్,మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఏవో నాగరాజు, ఎఈఓలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రాము లు, రైతు బంధు జిల్లా సభ్యుడు కోట్ల జగన్మోహన్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గ్గొన్నారు.