సికింద్రాబాద్ : నవరాత్రులు మండపాల్లో కొలువుదీరి విశేష పూజలందుకున్న ఏకదంతుడిని నిమజ్జనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో వర్షం పడుతున్నా ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతికి నీరాజనాలు పట్టారు. విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన వాహనాల్లో వివిధ ఆకృతుల్లో కొలువుదీరిన లంబోదరుని విగ్రహాలను ఆదివారం నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌కు తరలించారు.
డప్పుల దరువులు, తీన్మార్ స్టెప్పులతో గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ సాగిన శోభాయాత్ర ఆద్యంతం ప్రజల హృదయాల్లో భక్తి పారవశ్యం నింపింది. కంటోన్మెంట్‌లోని తిరుమలగిరి, కార్కానా, రసూల్‌పురా, బోయిన్పల్లి, మారేడ్పల్లిలతో పాటు సికింద్రాబాద్ పరిధిలోని బౌద్ధనగర్, వారాసిగూడ, పార్శిగుట్ట, మైలార్‌గడ్డ, నామాలగుండు, సీతాఫల్మండి, చిలకలగూడ గాంధీచౌక్, చిలకలగూడ ,ఔరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌కు శోభాయాత్ర కొనసాగింది.
నార్త్‌జోన్‌లోని బోయిన్పల్లి, కార్కానా, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, చిలకలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్త్‌జోన్ డీసీపీ కళ్మేశ్వర్ సింగెన్వార్ ఆదేశాల మేరకు ఆయా పరిధిలోని బేగంపేట, మహంకాళి, గోపాలపురం డివిజన్ల ఏసీపీల నేతృత్వంలో ఆయా స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.