కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో ఆటలాడుకుంటున్నది. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర రైతుల్ని ముప్పుతిప్పలు పెడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుంచీ కేంద్రం లోని ప్రభుత్వాలే ఆహార ఉత్పత్తుల సేకరణ బాధ్యతను నిర్వహిస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుత బీజేపీ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలబడుతుండడంతో తట్టుకోలేక తెలంగాణ నేతల్ని, రైతుల్ని చులనకగా చూస్తున్నది. రాష్ట్ర రైతుల పక్షాన మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రులు, ఎంపీలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ వేదికగా రాష్ట్ర రైతులను చులకన చేస్తున్న కేంద్రం వైఖరిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలకు చెందిన వారంతా మూకుమ్మడిగా ఖండిస్తున్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ కాలం లో ప్రాణాలు తెగించి కేసీఆర్ కొట్లాడారు. నేడు స్వరాష్ట్రంలో రైతు బాగు కోసం అలుపెరగని పోరాటానికి నాంది పలికారు. నాడు, నేడు పరిస్థితులు ఏవైనప్పటికీ రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుందంటే ముందుండి బరి గీసి పోరాటం చేసే వ్యక్తి కేసీఆర్. రాష్ర్టానికి ఆపద్బాంధవుడిగా కేంద్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఫక్తు రాజకీయాలనే నమ్ముకుని పరిపాలన చేస్తున్న బీజేపీ తీరును ప్రజల్లో తేటతెల్లం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు ఆహార ఉత్పత్తులను సేకరించడాన్ని బాధ్యతగా కేంద్ర ప్రభుత్వాలే నిర్వహించాయి. దేశవ్యాప్తంగా ఆహార కొరత లేకుండా ఉండేందుకు ఆహార సమతుల్యతలను పాటించే విధంగా గత ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. కాని ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోదీ సర్కా రు మాత్రం కనీస బాధ్యతలను నిర్వహించేందుకు వెనుకాడుతున్నది. అంతేకాకుండా రాష్ట్ర రైతాంగంపై విషం చిమ్ముతున్నది. రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వాన్ని అడ్డంపెట్టుకుని వ్యవసాయాన్ని రాజకీయ వస్తువుగా మార్చేసింది. ఢిల్లీ వేదికగా రాష్ట్ర రైతులను చులకన చేస్తున్న కేంద్రంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలకు చెందిన వారంతా మూకుమ్మడిగా ఖండిస్తున్నారు.
రైతులంటే అంత చులకనా…?
రాష్ట్ర రైతులంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చులకన భావం. అందుకే కేంద్ర మంత్రి హో దాలో ఉన్న పీయూష్ గోయల్ లెక్కా పత్రం లేకుండా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. రైతు కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ సర్కారు పోరు బాట పట్టింది. రైతు అనుకూల ఉద్యమాల నేపథ్యంలో ఢిల్లీకి తాకిన సెగలతో అల్లాడుతున్న బీజేపీ పెద్దలు ఏమీ చేయలేక ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నా రు. అందులో రాష్ట్ర రైతుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడం విచారం. ఒకప్పుడు ఏదేని పంట సీజన్లో ఉమ్మడి జిల్లాలో 4లక్షల నుంచి 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తేనే గొప్ప. ఇప్పుడది 11లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. వచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిస్క్ చేసి కొనుగోలు చేసింది. మర ఆడించి ఎఫ్‌సీఐకి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొర్రీలు పెడుతూ రాజకీయంగా పబ్బం గడుపుకొంటున్నది. బియ్యం తీసుకోదు. బస్తాలను తరలించదు. ఇదేమంటే ఉల్టా చోర్ కొత్వాల్‌కు ఢాంటే అన్నట్లుగా ఎదురుదాడి. వరి సేకరణపై కేంద్రం చేస్తోన్న యాగితో సీఎం కేసీఆర్ అప్రమత్తమై వచ్చే యాసంగిలో ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు.
కాటేస్తున్న కేంద్రం… కంటికి రెప్పలా కాపాడుతున్న రాష్ట్రం…
వ్యవసాయరంగంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలది సమా న బాధ్యత. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల మేలు కోసం వందకు వంద శాతం కేసీఆర్ సర్కారు మేలు చేస్తున్నది. కేంద్రప్రభుత్వం రైతును ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నది. కార్పొరేట్ శక్తులకు వంత పాడే విధంగా చట్టాలు తీసుకు రావడం, రైతు వ్యతిరేక నిర్ణయాలను అమలు చేయడం ద్వారా కేంద్ర సర్కారు తీవ్ర విమర్శల పాలవుతున్నది. దేశానికి వెన్నెముకలాంటి రైతు ను ఆదుకోవాల్సిన కేంద్రమే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతులపై మోదీ సర్కారు చూపిస్తున్న పక్షపాత చర్యలే ఇందుకు నిదర్శనమని రైతులోకం కోడై కూస్తోంది. పంజాబ్‌లో కండీషన్లు లేకుండా మొత్తం వరి ఉత్పత్తులను సేకరిస్తుండగా… రాష్ట్రంలో మా త్రం ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం పేరిట నానా యాగి చేస్తుండడమే నిదర్శనం. ఢిల్లీ వేదికగా కేంద్ర పౌరసరఫరాల మంత్రి పీయూష్ గోయల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ముమ్మాటికి కించపరిచే విధంగానే ఉన్నాయంటూ రాష్ట్రంలోని కర్షకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం..
నిజామాబాద్ జిల్లాలో 3లక్షల 43వేల 897 మంది రైతులు ఉన్నారు. 5లక్షల 75వేల 589 ఎకరాల సాగు భూమి ఉంది. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 33వేల 187 మంది రైతులు ఉన్నారు. 4లక్షల 92 వేల 303 ఎకరాల సాగు భూములున్నాయి. రాష్ట్రం రాక ముందు ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగయ్యే మొ త్తం విస్తీర్ణం 5 నుంచి 6లక్షల ఎకరాలు మాత్రమే. కానీ ఇప్పుడు సాగుకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంతో బీడు భూములన్నీ పచ్చని పంట పొలాలతో కనిపిస్తున్నాయి. తద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 10లక్షల ఎకరాల్లో యాసంగి, వానకాలాల్లో పంటలు సాగుకు నోచుకుంటున్నాయంటే సాధారణ విషయమేమి కాదు. వ్యవసాయిక ప్రాంతమైన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని రైతులకు రాష్ట్రం రాక మునుపు, వచ్చిన తర్వాత సాగు పరిస్థితుల్లో వచ్చిన మార్పులపై స్పష్టమైన అవగాహన ఉంది. సమైక్యపాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. నాడు రైతుల పరిస్థితులు తలచుకుంటేనే గుండె పగిలిపోతుంది. వ్యాపారుల వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చుకుని పెట్టుబడులు పెట్టేది. తీరా సాగుకు సిద్ధమైన సందర్భంలో పొలంలో నీళ్లుంటే కరెంట్ ఉండని దుస్థితి. ఒక వేళ కరెంట్ ఉంటే నీళ్లు ఉండని పరిస్థితి. ఎంతో శ్రమకోర్చి సాగు చేసిన పంటలకు నీళ్లు లేక ఎండిపోతే చలించే నాథుడే దిక్కు లేకుండా ఉండేది. ఆరుగాలం శ్రమించిన తర్వాత దిగుబడులు లేక, ఆదాయం రాక… చివరికి అప్పులు చెల్లించలేక భూములు అమ్ముకునేది. కానిప్పుడు రైతుకు పండుగలాంటి వ్యవసాయం ఊరూరా జరుగుతోంది.
కేంద్రానివి కుంటి సాకులు
ఖలీల్‌వాడి : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కుంటి సాకులు చెబుతున్నది. రాష్ర్టాలకే కొనుగోలు అధికారం కల్పించాలి. ఇప్పటికే ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలు భారీ ఎత్తున ఉన్నాయని డ్రామాలు ఆడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలి.
-డాక్టర్ రాజశేఖర్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి
కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకొని రైతులపై వివక్షతను విడనాడాలి. అన్నదాతల విషయంలో చులకన భావాన్ని మానుకోని వెంట నే ధాన్యం కొనుగోలు చేయాలి. రైతు లేకుంటే రాజ్యమే లేకుండా పో తుంది. అలాంటిది రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
-రమేశ్‌బాబు, సీపీఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి
కేంద్రం మొండి వైఖరిని విడనాడాలి
అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే రా జ్యం కూలిపోతుంది. అలాంటి రై తు లను బీజేపీ ప్రభుత్వం వివిధ చ ట్టాలను తీసుకువచ్చి బలి తీసుకోవ డమే కాకుండా ధాన్యం కొనుగోలు చేయ కుండా చోద్యం చూస్తున్నది. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు క్షమాపణలు చెప్పాలి.
-మల్యాల గోవర్ధన్, సీపీఎం నగర కార్యదర్శి
తెలంగాణ రైతుకు అన్యాయం చేయడమే
వడ్లను కొనబోమని చెబుతూ కేంద్రం అన్యాయం చేస్తున్నది. కేంద్రం నిర్ణయం రాష్ట్ర రైతులను చిన్న చూపు చూస్తున్నదనడానికి నిదర్శనం. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. రైతును, వారి కోసం పాటు పడే వారిని కించపరిచేలా మాట్లాడడం మానుకోవాలి.
-ఇజాప రవీందర్, క్రాప్ డాక్టర్-మీ రైతు నేస్తం వ్యవస్థాపకుడు, తొర్తి, ఏర్గట్ల మండలం
రైతులను మోసం చేస్తున్న కేంద్రం
డిచ్పల్లి : వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న ది. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కూడా తప్పుకోవడానికి యోచిస్తున్నది. నూనె గింజల పంటల వైపు రైతులను మళ్లించడానికి కేంద్రం వద్ద తగిన ప్రణాళికలు లేవు. వాటికి మద్దతు ధరలకు పార్లమెంట్ గ్యారెంటీ చట్టం తీసుకువచ్చి రైతులను ఆ వైపు మళ్లించాలి. వానకాలం, యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే.
-వేల్పూర్ భూమయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు
కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అ ప్పజెప్పే కుట్రలో భాగంగానే నేడు ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రం చెబుతున్నది. ఒకవైపు రైతే రాజు అంటూ దేశంలో రైతులను లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నది. మన దేశం వ్యవసాయరంగ దేశమ ని గతంలో కరెన్సీ నోట్లపైనా ముద్రించారు. ఇప్పుడు ఆ రంగాన్ని మొత్తం నాశనం చేయాలని చూస్తున్నది.
యావత్ తెలంగాణ ప్రజలను అవమానించినట్లే..
నిజాంసాగర్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో చర్చించేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రు లు, ఎంపీలను పనిలేక ఢిల్లీకి వచ్చారా అంటూ మంత్రి పీయూష్‌గోయల్ వ్యాఖ్యానించడం దా రుణం. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబి స్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
-మహేందర్‌కుమార్,
రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు, నిజాంసాగర్
కేంద్రం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను మానుకోవాలి
శక్కర్‌నగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను మానుకోవాలి. రాష్ర్టాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రజాస్వామ్య విధానాలు తుంగలో తొక్కుతున్నది. ఎఫ్‌సీఐ కేంద్రం పరిధిలోనే ఉంటుంది. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. ఇప్పటికే నల్లచట్టాలు చేసేందుకు యత్నించిన కేంద్రం నవ్వులపాలయ్యింది. ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతులకు న్యాయం చేయాలి.
-షేక్ బాబు, సీపీఐ బోధన్ నియోజకవర్గ కార్యదర్శి
కార్పొరేట్ సంస్థల కోసమే..
బోధన్ : కార్పొరేట్ సంస్థలు, బడా కంపెనీల ప్రయోజనాల కోసం వ్యవసాయరంగాన్ని నాశనం చేయాలని కే్రందం కుట్రలకు పాల్పడుతున్నది. ఇందులో భాగంగానే అనేక రైతు వ్యతిరేక విధానాలను ప్ర భుత్వం అమలుచేస్తున్నది. రాష్ట్రంలో విస్తారంగా పండే వరి కొనుగోలు చేసే విషయంలో కేంద్రం సరైన వైఖరిని స్పష్టంచేయకపోవడం చూస్తుంటే రైతులను ఇబ్బందులుపాలు చేస్తుందన్న విషయం అర్థమవుతున్నది.
-బి.మల్లేశ్, న్యూడెమోక్రసీ బోధన్ సబ్‌డివిజన్ కార్యదర్శి
రైతులను మోసం చేసేందుకే కేంద్రం కుట్ర
డిచ్పల్లి : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను మోసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదనే విషయం జగమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్, హర్యానా, సిక్కిం ప్రాంతాల్లో రైతుచట్టాలపై ఉద్యమం ఎలా చేశారో అలాగే రైతులకు అవగాహన కల్పించి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ బాగోతాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-చంద్రపు సాయాగౌడ్,అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి
మాయమాటలతో తప్పించుకునే ప్రయత్నం
నందిపేట : ధాన్యం కొనేవరకూ కేంద్ర ప్రభుత్వం పై పార్టీలకతీతంగా అందరూ కలిసికట్టుగా పోరు చేయాలి. ప్రతి గింజా కొనాల్సిందే. కేంద్రం ప్రభు త్వం మాయ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు కలిసికట్టుగా ఉద్యమం చేసి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
-కే. గంగాధర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు