సిద్దిపేట, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌కు చెందిన ఉద్యమకారుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు మరోమారు గౌరవం దక్కింది. రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడికి మరోసారి పదవి దక్కడంపై ఉమ్మడి జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్ర సాధనలో శ్రీనివాస్ చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమంలో విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన దైన పాత్రను పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేసి, మలిదశ ఉద్యమంలో పాల్గొనే విద్యార్థి లోకాన్ని నడిపించారు. టీఆర్ఎస్ పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీలో అంకితభావంతో పనిచేసే నాయకులకు పదవులు సరైన సమయంలో వస్తాయని మరోసారి రుజువైంది. 2010లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ వరకు, అక్కడి నుంచి అదిలాబాద్ వరకు 750 కిలోమీటర్లు సాగిన ఉద్యమానికి మహాపాద యాత్రలో ప్రధాన పాత్ర పోషించారు. 2010 నుంచి 2016 వరకు టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 2018 నుంచి 2020 వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసి, సీఎం కేసీఆర్ సహకారంతో కమిషన్ కార్యాలయాన్ని కార్పొరేట్ ఆఫీసు తరహా రూ.2 కోట్లతో మార్చారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను దేశంలోనే రోల్ మోడల్‌గా మార్చడానికి కృషి చేశారు. 13,905 కేసుల్లో అట్రాసిటీ బాధితులకు పరిహారంగా రూ.78 కోట్లకు పైగా పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. దళితుల, ఆదివాసీల జీవన స్థితిగతులపై వ్యక్తిగత తనిఖీ కోసం 819 క్షేత్ర పర్యటనలో 7,932 అర్జీలను స్వీకరించి పరిష్కరించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. టీఆర్ఎస్లో ఒక క్రమ శిక్షణ కలిగిన నాయకుడిగా పని చేయడం మూలంగానే మరోసారి పదవి వరించిందని చెప్పాలి.