కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 23: సింగరేణి సంస్థ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు కోటి మందికి జీవనోపాధి కల్పించిందని సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్.బలరాం అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో గురువారం జరిగిన సింగరేణి సంస్థ 133వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సింగరేణి పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా బెలూన్స్‌ను గాలిలోకి వదిలారు. అనంతరం సింగరేణిలోని వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారంభించారు. అనంతరం వాటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో విద్యుత్ వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థకు 133 ఏళ్ల ఘన చరిత్ర ఉందని గుర్తుచేశారు. సింగరేణి సంస్థ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారని, ప్రస్తుతం 45 వేల మంది సింగరేణి కార్మికులు, 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు. అధికారులు, కార్మికులు సమష్టి కృషితో పనిచేయాలని, నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని, సంస్థను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ప్రమాదాలు జరిగినప్పుడు సింగరేణి రెస్కూ ్యటీమ్ కార్మికులను కాపాడే విధానాన్ని చూపించే ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. గురువారం ఉదయం ఆర్జీ3 ఏరియా ఓసీపీ 1లో ఆగి ఉన్న డంపర్‌ను ఢీకొట్టి మృతిచెందిన కలిశెట్టి శ్రీనివాసరావు ఆత్మశాంతి కోసం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావు, జీఎం పర్సనల్ (ఐఆర్ అండ్ పీఎం) ఆనందరావు, జీఎం వెల్ఫేర్ కే.బసవయ్య, జీఎం సెక్యూరిటీ కుమార్‌రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, కార్పొరేట్ ఉపాధ్యక్షుడు ముప్పాని సోమిరెడ్డి, ఏఐటీయూసీ నేత సీతారామయ్య, అన్ని విభాగాల జీఎంలు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.