
ఎదులాపురం, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన సందర్భంగా జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల సమాచారాన్ని ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేస్తున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయింపు వివరాలను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు కార్యక్రమాన్ని ఆయా జిల్లాల శాఖధిపతుల సహకారంతో నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 317 అనంతరం జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా కమిటీల సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల కేటాయింపు, పోస్టింగ్ ఉత్తర్వులను సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా స్థాయి క్యాడర్లో పనిచేస్తున్న 1143 మంది ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలకు కేటాయించగా.. 892 మంది ఆయా జిల్లాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించామ ని తెలిపారు. ఆదిలాబా ద్ జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగుల సమాచా రం ప్రభుత్వ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేస్తున్నామని వివరించా రు. ఆ సమాచారమంతా క్రోడీకరించి నమోదు చేసేందుకు రెవెన్యూ అధికారులతో టీమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమర్పిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, కలెక్టర్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.