మాక్లూర్, డిసెంబర్ 30: జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో కొత్తగా శాఖ గ్రంథాలయాల ఏర్పాటుకు కృషిచేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్ అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావుతో కలిసి మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీలో ఉన్న పుస్తకాలు, ఉద్యోగుల రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు సమయపాలన పాటించాలని సూచించారు. రూ.16లక్షల సోషల్ వెల్ఫేర్ నిధులతో నిర్మిస్తున్న శాఖ గ్రంథాలయ నూతన భవనాన్ని పరిశీలించారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం ఉండే లా చూడాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
బీజేపీ ద్వంద్వ వైఖరితో రైతులకు నష్టం..
అనంతరం జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరితో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నాయకులు ఒక మాట, రాష్ట్ర నాయకులు మరోమాట చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు అన్నదాత బ్యాంకు ఖాతాల్లో జమకావడంతో వారి ముఖాల్లో అనందం కనిపిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ధర్నా, మంత్రుల ఢిల్లీ పర్యటనతో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం ఒప్పుకున్నదన్నారు. వర్నిలో ప్రభుత్వ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తాను, ఎల్ఎంబీ రాజేశ్వర్ ఉద్యమ సమయంలో పోరాటం చేశామని, కేసీఆర్ ఉద్యమకారులకు తగిన గుర్తింపును ఇచ్చారని ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి బుగ్గారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్రావు, మీరాబాయి, కో-ఆప్షన్ సభ్యుడు హైమద్, డైరెక్టర్ కాశీనాథ్‌రావు, గ్రంథ పాలకుడు నరేశ్‌రెడ్డి, ఉపసర్పంచ్ అనితా రమణారావుతో పాటు నర్సాగౌడ్, అమృత్, విఠల్‌రావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నూతన భవనాన్ని నిర్మిస్తాం..
నందిపేట్, డిసెంబర్ 30: నందిపేట్‌లో అన్ని హంగులతో గ్రంథాలయ నూతన భవనాన్ని నిర్మిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఆయన ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. నందిపేట్ లైబ్రరీకి పక్కా భవనం అవసరమని ప్రజాప్రతినిధులు కోరగా.. స్థలాన్ని కేటాయిస్తే భూమిపూజ చేసి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం చైర్మన్‌ను ప్రజా ప్రతినిధులు, నాయకులు శాలువా కప్పి సత్కరించారు. ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాముడ పోశెట్టి, సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.