
మూసాపేట, డిసెంబర్ 31 : పరిశ్రమల ఏర్పాటుతోనే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతోపాటు సంకలమద్ది, తున్కినీపూర్ గ్రామాల శివారుల్లో ఉన్న ప్రభుత్వ భూములను తాసిల్దార్ మంజుల, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు నెలల కిందట పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలిసి నియోజకవర్గంలోని యువతకు ఉపాధి పెంచడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అందుకు స్పందించిన మంత్రి పరిశ్రమల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అందులో భాగంగానే అధికారులతో కలిసి పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. మూసాపేట, సంకలమద్ది, తున్కినీపూర్ సమీపాల్లో ఉన్న ప్రభుత్వ భూములు రవాణా సౌకర్యంతోపాటు అన్ని విధాలా సరిపోతాయని చెప్పారు. వెంటనే అనువైన స్థలాన్ని గుర్తించి నివేదికలు అందజేయాలని తాసిల్దార్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. స్థానిక అవసరాలకు మట్టి అవసరముంటే ఇండస్ట్రీయల్ కారిడార్‌కు ఎంపిక చేసిన ప్రాంతాల్లో అనుమతి ఇవ్వాలని కోరారు. అంతకుముందు కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల చిట్టెమ్మకు రూ.5 లక్షల రైతుబీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అయ్యప్ప కొండపైకి సంకల్పసిద్ధి అయ్యప్ప సేవా సమితి వారు ఆహ్వానించి ఎమ్మెల్యేతోపాటు జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, తాసిల్దార్ మంజుల, సర్వేయర్ పార్వతమ్మ, గిర్దావర్ మమత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో గూపని కొండయ్య, భాస్కర్‌గౌడ్, రఘుపతిరెడ్డి, శివరాములు, మశ్చేందర్నాథ్, మల్లయ్య, కోట్ల రవి, శ్రీనివాస్‌శర్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.