కోటగిరి, డిసెంబర్ 30 : నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకునేలా చూస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలంలోని హెగ్డోలి, యాద్గార్పూర్, టాక్లీ, వల్లభాపూర్, ఎత్తొండ, దోమలెడ్గి, సోంపూర్, రామ్‌గంగానగర్‌లో వడగండ్ల వానకు దెబ్బతిన్న శనగ, పొద్దుతిరుగుడు, మక్కజొన్న, మినుము పంటలను ఆయన రైతులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వడగండ్ల వానకు నష్టపోయిన పంటలపై పూర్తిస్థాయిలో సర్వే చేపట్టి ఎంత నష్టం వాటిల్లిందో వివరాలను పక్కాగా నమోదుచేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. మండలంలో శనగ పంట 3,800 ఎకరాలు, పొద్దుతిరుగుడు 2,862, మక్కజొన్న 338, మినుము 45, కూరగాయలు 20 ఎకరాలు, ఇతర పంటలు కలిపి మొత్తం సుమారు 7,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయాధికారి శ్రీనివాసరావు స్పీకర్‌కు వివరించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న పంటల స్థానంలో ఏ పంటలు వేయాలనుకుంటున్నారో రైతుల అభిప్రాయాలను సేకరించాలన్నారు. రైతులు అడిగిన విత్తనాలు సహకార సంఘంలో అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ను స్పీకర్ ఆదేశించారు. స్పీకర్ వెంట జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌పటేల్, సర్పంచులు వెంకాగౌడ్, సాయిబాబా, శ్రీనివాస్‌గౌడ్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్‌రావు, రైతుబంధు మండల కన్వీనర్ కిశోర్‌బాబు, తేళ్ల అరవింద్, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, ప్రధానకార్యదర్శి మొత్తిపేట రవికుమార్, ఎంపీటీసీ సభ్యుడు విఠల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, జడ్పీ కో-ఆప్షన్ ఎండీ సిరాజ్, చాకూరే గంగాధర్, జగన్, హరిపటేల్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్ తదితరులు ఉన్నారు.