
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఇప్పటి వరకు కొన్న వరిని నిల్వ చేసే సామర్థ్యం ఎఫ్‌సీఐకి లేదు. ప్రస్తుతం ఉన్న నిల్వ తీసుకెళ్లేందుకు గూడ్స్ వ్యాగన్స్ రావు. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు వికారాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం 70 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ చేసే సామర్థ్యం ఉన్నది. దీంతో ఓ వైపు ధాన్యం నిల్వలు పెరిగిపోతుంటే ఎఫ్‌సీఐ మాత్రం తన సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ
రాష్ర్టానికి పరీక్ష పెడుతున్నది. ఎన్నో సమస్యలు సృష్టిస్తూ బియ్యం సేకరణను అపహాస్యం చేస్తున్నది. మిల్లర్ల వారీగా స్టాక్ నిర్వహించడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేంద్రం తీరుతోనే బియ్యం సేకరణలో రాష్ట్రం వెనుకబడిపోయింది. కానీ ఈ నెపం మాత్రం తెలంగాణపై నెట్టే యత్నం చేస్తున్నది.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సేకరించాల్సిన బియ్యాన్ని తీసుకుపోలేని స్థాయిలో ఉన్న కేంద్రం.. తన తప్పును ఒప్పుకొనే పరిస్థితిలో కనిపించడంలేదు. ఇచ్చింది తీసుకుపోలేక, కొ త్తగా కొనుగోలు చేసేందుకు చేతకాక రాష్ట్రంపైకి నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. యాసంగి వడ్లు కొనాలని కోరేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రి నిరంజన్‌రెడ్డి బృందాన్ని అవమానించడమే కాకుండా పైపెచ్చు తెలంగాణే ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వడం లేదని సాకులు చెబుతున్నది. వాస్తవంగా బియ్యం సేకరించాల్సిన ఎఫ్సీఐకు తగినంత నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు లేవు. ప్ర స్తుతం గోదాముల్లో మూలుగుతున్న బియ్యం తరలించేందుకు గూడ్స్ తగినన్ని సమకూర్చేందుకు కేంద్ర ప్ర భుత్వానికి చేతకావడం లేదు. అయినా ఈ అంశంపై రాజకీయం చేస్తూ తెలంగాణను బద్నాం చేసేందుకు ప్ర యత్నిస్తున్నది. దీనిపై గతంలో ‘నమస్తే తెలంగాణ’లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పూర్తి డేటా తో కథనం సైతం ప్రచురితమైంది. వికారాబాద్ జిల్లా కలుపుకొని ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం ఎఫ్‌సీఐ సేకరించాల్సి ఉండగా.. డిసెంబర్ 6వ తేదీ నాటికి కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారనే విషయాన్ని ఆధారాలతో సహా ప్రచురించింది. ఇంకా సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉండగా.. నేటికీ పెద్దగా పురోగతి లేదు. ఎఫ్‌సీఐ విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ ఏడాది మే నుంచి పాలమూరులో ఎఫ్‌సీఐ బియ్యం సేకరిస్తున్నది. దాదాపు 8 నెలల్లో వారు చేరుకున్న లక్ష్యం కేవలం 40 శాతం కూడా దాటలేదు. ఇంకా మిగిలి ఉన్న 9 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యం. సేకరణలో వెనకబడేందుకు ప్రధాన కారణం కేంద్రం తీరే. ఉమ్మడి జిల్లా పరిధిలో 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సేకరణ లక్ష్యం ఉన్నప్పుడు కనీసం 2 నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు అయినా ఉండాలనేది నిపుణుల మాట. కానీ ఇక్కడ ఉన్న కేవలం 70వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం మాత్రమే ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న సీడబ్ల్యూసీ గోదాములో ఎఫ్‌సీఐకి 20 వేల సామర్థ్యం ఉండేది. దాన్ని ఇప్పుడు సగానికి తగ్గించారు. ధాన్యం నిల్వలు పెరిగిపోతుంటే ఎఫ్‌సీఐ మాత్రం తన సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ రాష్ర్టానికి పరీక్ష పెడుతున్నది. అనేక కొర్రీలు వేస్తూ బియ్యం సేకరణను అపహాస్యం చేస్తున్నది. మిల్లర్ల వారీగా స్టాక్ నిర్వహించడంతో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ మిల్లర్‌కు సంబంధించిన లాట్ ఆయన మాత్రమే భర్తీ చేయాలని ఎఫ్‌సీఐ నిబంధన పెడుతున్నది. సదరు మిల్లర్ సకాలంలో స్టాక్ అందించకపోతే ఆ స్థానంలో వేరే మిల్లర్ స్టాక్ ఇచ్చేందుకు ఎఫ్‌సీఐ ఒప్పుకోవడం లేదు. దీంతో ఖాళీ ఉన్న కూడా అక్కడ బియ్యం సేకరించని పరిస్థితి తలెత్తుతున్నది. ఇక ఏటా ప్రైవేట్ గోదాములతో అగ్రిమెంట్ చేసుకునేందుకు ఎఫ్‌సీఐ బాగా సమయం తీసుకుంతున్నది. ఇక మహబూబ్‌నగర్ స్టాక్ పాయింట్ నుంచి బియ్యం తరలించేందుకు వారానికి 4 నుంచి 6 వ్యాగన్లు రావాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం 2 నుంచి 3 వ్యాగన్లు మాత్రమే పంపిస్తున్నారు. ఆరు వ్యాగన్లు వస్తే సుమారు 12 వేల మెట్రిక్ టన్నులు తరలించే అవకాశం ఉండేది. కానీ, 2 లేదా 3 వ్యాగన్లు మాత్రమే రావడంతో కేవలం 7 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తరలుతున్నది. ఈ లెక్కన కేంద్రం, ఎఫ్‌సీఐ తెలంగాణకు కళ్లముందే అన్యాయం చేస్తున్నా.. రాష్ట్రమే బియ్యం ఇవ్వలేదంటూ పీయూష్ గోయల్ బుకాయించడం చూస్తే వీరి తీరు అర్థమవుతున్నది. రాష్ట్రం బియ్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. సరైన గోదాముల సామర్థ్యం లేకపోవడంతో పాటు తగినన్ని వ్యాగన్లు పంపించకుండా కేంద్రమే తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. పైపెచ్చు కేంద్ర మంత్రి అబద్దాలు చెబుతూ అందరినీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రానికి తెలంగాణ నుంచి పద్ధతి ప్రకారంగా బియ్యం సేకరించాలనే ఆలోచనే లేదని, అందుకే నిత్యం కొర్రీలు పెడుతున్నదని రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనే 1,59,996 మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉండగా.. నేటి వరకు 82,276 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్‌సీఐ సేకరించింది. ఇది 51.42 శాతం మాత్రమే.
ఎన్నికలున్న చోట మాత్రమే కొంటరా..?
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడిగా రైతుబంధు సాయం అందుతున్నది. అందుకే గతంలో బీడు బారిన భూముల్లో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్రం తెలంగాణ నుంచి ధాన్యం సేకరించమని చెబుతున్నది. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉందా. ఇక్కడి వారు రైతులు కాదా.. కేవలం ఉత్తరాది రాష్ర్టాలు, ఎన్నికలున్న చోట నుంచి మాత్రమే ధాన్యం కొంటారా.. మోదీ మాపై ఎందుకింత పగ. కేంద్రం రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం తగదు. అన్నదాతల కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్‌ను ఇబ్బంది పెట్టడమేంటి.