
స్వేదం చిందించి సేద్యం చేసే అన్నదాతతో కేంద్రంలోని బీజీపే సర్కార్ ఆటలాడుతున్నది. ఆరుగాలం కష్టించే కర్షకుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నది. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతుల నడ్డివిరుస్తున్నది. ధాన్యం కొంటారా? కొనరా తేల్చిచెప్పకుండా దాగుడు మూతలాడుతూ మోసం చేస్తున్నది. అంతేకాదు, కర్షకులను కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపా డుకుంటున్న తెలంగాణ ప్రభుత్వంపై కక్షసాధింపునకు పాల్పడుతున్నది. కేంద్రంలోని బీజేపీ నేతల ఓ మాట.. రాష్ట్ర కమలం నేతలు మరోమాట మాట్లాడుతూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు.
తెలంగాణ రైతాంగంతో కేంద్రం ప్రభుత్వం తొండాట ఆడుతున్నది. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంటే.. కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ వ్యాపా రుల ప్రతినిధిగా మాట్లాడు తున్నారు. అయితే, రైతులను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్ల దగ్గరకు చేర్చి అటు నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తున్నది. ఈ క్రమంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నా.. కర్షకుల కోసం నిరంతరం పరితపిస్తున్నది. అయితే, గోదాములు ఖాళీ లేకపోవడంతో బియ్యం తరలించిన వాహనాలు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. సకాలంలో వ్యాగన్లు రాకపోవడంతో గోదాముల నుంచి బియ్యం తరలించలేని పరిస్థితి. దీంతో కేంద్రం తీరుపై రైతులు మండిపడు
తున్నారు.
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలుకు నిరాకరించి రైతులకు అన్యాయం చేస్తున్నది. రైతులను కంటికి రెప్పలా చూసుకుంటున్న తెలంగాణ సర్కార్ వానకాలంలో ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్ల దగ్గరకు చేర్చినా ఎఫ్‌సీఐ గోదాముల్లో ధాన్యం నిల్వకు చోటు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం బియ్యం ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పక్షాన తెలంగాణ సర్కార్..
తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతున్నది. కేంద్రప్రభుత్వం మాత్రం రైతులపై కక్షగట్టింది. రాష్ట్ర ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ప్రధాన పంట అయినా పూర్తిగా నిలిపివేసేలా ప్రకటనలు చేస్తున్నది. యాసంగి సీజన్లో ధాన్యం కొనేందుకు ససేమిరా అంటున్నది. స్వరాష్ట్రం రాకముందు జిల్లాలో సాగు కేవలం 4 లక్షల ఎకరాలకు పరిమితమయ్యేది. ప్రస్తుతం ఈ విస్తీర్ణం 7 లక్షల ఎకరాలకు చేరింది. వానకాలం, యాసంగికి పుష్కలంగా సాగునీరు అందుతుండడంతోనే సాగు విస్తీర్ణం పెరిగింది. భక్తరామదాసు ప్రాజెక్టు, సాగర్ ఎడమ కాలువ ద్వారా నిరంతరం నీటి సరఫరా, 24 గంటల పాటు పం టలకు ఉచిత విద్యుత్ అందుతుండడంతో సాగుకు ఇబ్బందులు తప్పాయి. ఈ పరిస్థితిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నది.
రోజుల తరబడి నిరీక్షణ..
కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. ఎఫ్‌సీఐ పరిధిలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. గోదాముల పరిధిలో నిల్వకు తావు లేదు. దీంతో మిల్లర్ల నుంచి సేకరించిన బియ్యం దిగుమతి చేయడానికి ఎఫ్‌సీఐ అధికారులు అవస్థలు పడుతున్నారు. లోడ్ తీసకువచ్చిన లారీ యజమానులు, డ్రైవర్లు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. వానకాలంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 249 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 201 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. సర్కార్ ఇప్పటివరకు 17,519 మంది రైతుల నుంచి 1,32,825 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. మరో 1,26 509 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు చేరవేసింది. అతి తక్కువ రోజుల్లోనే రైతుల అకౌంట్లలో సొమ్మును జమ చేసింది. ఇప్పటివరకు 8,762 మంది ఖాతాల్లో రూ.146.22 కోట్ల నిధులు జమ చేసింది. ఒకటి రెండు రోజుల్లో మిగిలినవారి ఖాతాల్లో డబ్బు జమ కానున్నది. భద్రాద్రి జిల్లాలోని ఎఫ్‌సీఐ పరిధిలో 1,500 మెట్రిక్ టన్నుల ధాన్యపు నిల్వలు ఉన్నాయి.
కేంద్రం తీరుపై రైతుల మండిపాటు
రాష్ట్ర రైతులపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై జిల్లా రైతాంగం మండిపడుతున్నది. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను వరి సాగు చేయమని సూచిస్తున్నారు. సాగు చేస్తే వచ్చిన దిగబడిని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయడం లేదో.. చెప్పడం లేదు. కేంద్రం మాత్రం ధాన్యం కొనుగోలు చేయలేమని తెగేసి చెప్పింది. ఒకే పార్టీలో ఉన్న నేతలు రెండు భిన్నమైన ప్రకటనలు చేయడాన్ని రాష్ట్ర రైతులు గమనిస్తూనే ఉన్నారు. అన్నపూర్ణగా దేశానికే అన్నం పెడుతున్న తెలంగాణపై కేంద్రం కపట ప్రేమ చూపడాన్ని రైతులు నిరసిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు ధర్నాలో పాల్గొని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. పైగా రైతుల పక్షాన నిలబడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నది. రైతులను అనేక విధాలుగా మోసం చేస్తున్న బీజేపీ నాయకులకు బుద్ధి చెబుతామని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రైతులపైనే గురిపెట్టి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శిస్తున్నారు.
రాష్ట్ర రైతులు ఏం పాపం చేశారు?
రాష్ట్ర రైతాంగం ఏం పాపం చేశారు. వారిపై బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంత పగ..? ఇక్కడ రైతులు యావత్ దేశానికే ఆహార ధాన్యం అందిస్తున్నారు. వారిని ఆదుకోవాల్సి ఉండగా ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పడం ఎంతవరకు సమంజసం? కేంద్ర సర్కార్ మొదటి నుంచి రాష్ట్ర రైతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నది. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.
రాష్ట్ర రైతులపై వివక్ష తగదు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్ష చూపుతున్నది. కేంద్రం అన్ని రాష్ర్టాలను ఒకే రకంగా చూడాల్సి ఉండగా తెలంగాణను చిన్నచూపు చూస్తున్నది. కేంద్రం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నది. ధాన్యం కొనకపోతే కాలువల కింద పొలాలు ఉన్న వారు వరి తప్ప ఇక ఏ పంట సాగు చేయాలి ?
బీజేపీది రెండు నాల్కల ధోరణి..
ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నది. దీంతో రైతులను అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు యాసంగిలో వరి సాగు చేయమని రైతులకు సూచిస్తున్నారు. కేంద్రం మాత్రం ధాన్యం కొనుగోలు చేయలేమని తెగేసి చెప్తున్నది. ఏ పార్టీకైనా ఒకే రకమైన విధానం ఉంటుంది. కానీ వేర్వేరు ప్రకటనలు చేయడం ఏమిటి? రాష్ట్ర రైతులపై కేంద్రం వివక్ష చూపుతున్నది. బీజేపీకి రైతులు సమయం, సందర్భం వచ్చినప్పుడు కర్రుకాల్చి వాత పెడతారు.
బీజేపీకి రైతుల ఉసురు తగులుతుంది..
యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయలేమని ప్రకటించడం, ఉన్నపళంగా వరి సాగు చేయవద్దని చెప్పడం సరికాదు. మరోవైపు వానకాలంలో సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీ లేకపోవడంతో దిగుమతులు ఆలస్యమవుతున్నాయి. కేంద్రం వైపే అన్ని తప్పులు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. రైతుల ఉసురు బీజేపీకి తగులుతుంది.
రైతుల జీవితాలతో కేంద్రం చెలగాటం
కాయకష్టం చేసి బతుకు వెళ్లదీస్తున్న రైతుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నది. రైతులపై పగబట్టినట్లు వ్యవహరించడం దారుణం. రైతులు ఉద్యమించి తీరుతారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం అన్యాయం. రైతులు తమకున్న భూమిలో ఏ పంట పండితే అది మాత్రమే పండిస్తారు. ఆ భూమిలో వేరే పంటలు పండించమంటే ఎలా సాధ్యం. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం దిగి రావాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే..
కేంద్రం డ్రామాలు చెల్లవు. ఎన్ని ఎత్తులు వేసినా ధాన్యం కొనుగోలు విషయంలో దిగిరావాల్సిందే. రైతులు తలచుకుంటే ఏదైనా చేస్తారు. రైతుల శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఢిల్లీ పీఠం కదిలే వరకు పోరాటాలు చేస్తాం. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తాం.
బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం..
తెలంగాణ రైతులకు కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అ న్యాయం చేస్తున్నది. కేం ద్రానికి బుద్ధి చెబుతాం. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయలేమని చెప్పడం దారుణం. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు విషయంలో దాటవేత ధోరణి పనికి రాదు. రైతులు పండించిన ప్రతి గింజనూ కేంద్రమే కొనుగోలు చేయాలి.