గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం ఇంకా ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. తగినన్ని రైల్వే ర్యాకులు రాక, రాష్ట్రం ఇచ్చే బియ్యాన్ని తరలించలేక, గోదాములు ఖాళీ చేయలేకపోతున్న భారత ఆహార సంస్థ వైఫల్యాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని స్టాక్ పాయింట్ల వద్ద సందడి లేని వాతావరణం నెలకొనగా.. ఎఫ్‌సీఐ గోదాముల వద్ద బియ్యం లోడ్లతో లారీలు బారులు తీరుతుండడం వాస్తవాన్ని తేటతెల్లం చేస్తున్నది. నిజాలు కండ్ల ముందు కనిపిస్తున్నా.. అసత్యాలు, అర్ధసత్యాలతో కేంద్రం గారడీలు చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు గత నెలలో వరి వేయాలంటూ రైతులను రెచ్చగొట్టిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. వరి వేయవద్దన్న పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యల తర్వాత యాసంగి సీజన్ సాగుపై నోరువిప్పకపోవడం గమనార్హం.
నిజామాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వి ఫలమైందని, గత యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్నే ఇంకా ఇవ్వలేదని మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. కానీ తగినన్ని రైల్వే ర్యాకులు రాక, రాష్ట్రం ఇచ్చే బియ్యా న్ని తరలించలేక, గోదాములు ఖాళీ చేయలేకపోతు న్న భారత ఆహార సంస్థ వైఫల్యాన్ని మాత్రం ఒప్పుకోలేకపోయారు. తమ వైఫల్యాలను రాష్ట్రం పైకి నెట్టివేసి వడ్ల పేరిట బీజేపీ రాజకీయం చేస్తున్నది. ఇందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని స్టాక్ పాయింట్ల వద్ద సందడిలేని వాతావరణమే నిదర్శనం కాగా… ఎఫ్‌సీఐ గోదాముల వద్ద బియ్యం లోడ్లతో బారులు తీరుతున్న లారీ లు సైతం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. వాస్తవ పరిస్థిథి ఇలా ఉంటే వక్రబుద్ధితో బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రైతు లు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని గల్లీల్లో పరిస్థితులు ఇలా ఉంటే… ఢిల్లీ వేదికగా బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం నవ్విపోదురు గాక నా కేంటి సిగ్గు అన్న చందంగా మారింది. గత నెలలో వరి వేయాలంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను రెచ్చగొట్టారు.తాజా పరిస్థితుల్లో కనీసం యాసంగి సీజన్ పంటల సాగుపై నోరు ఎత్తకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గోదాముల వద్ద లారీలు బారులు…
కస్టం మిల్లింగ్ రైస్ తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎఫ్‌సీఐ ఆడుతున్న వింత నాటకంలో రైతులు బలికావాల్సిన దుస్థితి ఏర్పడింది. బియ్యం నిల్వకు భారీ ఎత్తున స్టోరేజీలు అవసరం. ఎఫ్‌సీఐ వద్ద రైతుల నుంచి వస్తున్న దిగుబడులకు సరిపడా గిడ్డంగులు లేవు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎఫ్‌సీఐ గోదాముల ముందు లారీల కొద్దీ బియ్యం బారులు తీరి కనిపిస్తుంటే రాష్ట్ర సర్కారే బియ్యం ఇవ్వడం లేదంటూ స్వయంగా కేంద్ర మంత్రి అబద్ధపు ప్రకటనలు చేయడం విడ్డూరంగా మారింది. పౌరసరఫరాల సంస్థ ద్వారా వెల్లడైన గణాంకాల ప్రకారం నిజామాబాద్ జిల్లా టార్గెట్ 5,10,265 మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటికే మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు డెలివరీ పూర్తయ్యింది. మిగిలిన 1.70లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిజామాబాద్‌లోని రైస్ మిల్లుల్లో నే కుప్పలు తెప్పలుగా పడి ఉంది. ఎఫ్‌సీఐ సేకరణ నిలిపేయడం, కేంద్రం నుంచి స్టాక్ పా యింట్లకు రైల్వే నుంచి ర్యాకులు రాకపోవడంతో ఎక్కడి బియ్యం నిల్వలు అక్కడే నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా టార్గెట్ 2,99,790 మెట్రిక్ టన్నులు కాగా… లక్షా 21వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి షిఫ్ట్ అయ్యింది. మిగిలిన 1.78 లక్షల మెట్రి క్ టన్నుల బియ్యం సరఫరాకు యంత్రాంగం సిద్ధమైనప్పటికీ ఎఫ్‌సీఐ నుంచి చడీచప్పుడు లేకపోవడంతో లారీల్లో తరలుతున్న బియ్యం బస్తాలు గో దాముల వద్ద బారులు తీరాల్సి వస్తున్నది. ఇది వా స్తవమైతే… ఇందుకు భిన్నంగా బీజేపీ ప్రభుత్వం అసంబద్ధ ఆరోపణలతో పబ్బంగడుపుతున్నది.
రెచ్చగొట్టి పరారైన అర్వింద్…
నిత్యం ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేయడమే రివాజుగా మార్చుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంబద్ధ ప్రకటనలతో ప్రజ ల్లో తేలిపోతున్న బీజేపీ ఎంపీకి ఇప్పుడు ముఖం చెల్లుబాటు కావడం లేదు. నవంబర్ మొదటి వా రం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కా మెంట్లు చేసిన ఆయన నేడు పత్తాకు కనిపించడం లేదు. వడ్ల విషయంలో కేంద్ర సర్కారు వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చర్యలు చేపట్టింది. యాసంగిలో వరి పంట సాగు చేస్తే ఒనగూరే నష్టాలను గ్రహించి రైతులను ఇతర పంటల సాగు వైపు మళ్లిస్తున్నది. వరి సాగు చేయవద్దంటూ ప్రభుత్వమే ప్రకటన చేసి రైతులకు మేలు చేస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విరుద్ధమైన ప్రకటనలు చేశారు.
వరి వేయాలంటూ రైతులను తప్పుదోవ పట్టించా రు. అంతేకాకుండా వరి వేయ వద్దంటే ఊరుకోబోమంటూ రైతులను తప్పుదోవ పట్టించారు. తీరా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మెట్టు దిగివచ్చి వరి వేయొద్దని చెప్పడంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన ప్రకటనలకు అర్థం లేకుండా పోయింది. రైతులను తప్పుదోవ పట్టించేందుకు చూసిన అర్వింద్ తీరుపై ఇప్పుడు జిల్లా ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతున్నది. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి రైతులను తప్పుదోవ పట్టించడం పద్ధతి కాదంటూ విమర్శిస్తున్నా రు. పైగా… వరి వేయాలని చెప్పిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తాజా పరిస్థితుల నేపథ్యంలో యాసంగి సాగుపై కనీసం మాటెత్తక పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పందించరు.. సమాధానం చెప్పరు..
బియ్యం నిల్వల మూవ్‌మెంట్‌పై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. పోటెత్తుతున్న సీఎంఆర్‌ను వెనువెంటనే తరలించాలంటూ విన్నపాలు చేస్తున్నారు. అంతేకాకుండా గోదాముల్లో స్థల ప్రభావంతో ఎదురవుతున్న ఇక్కట్లను వారికి వివరిస్తున్నారు. కానీ… ఎఫ్‌సీఐ అధికారుల నుంచి కనీస స్పందన లేకుండా పో యింది. రైల్వే శాఖతో మాట్లాడి వ్యాగన్లు తెప్పించాలని, సేకరించిన బియ్యాన్ని తరలించాలని కోరితే కనీసం ఉలుకు… పలుకు లేదు. లారీల్లో తరులుతున్న బియ్యం బస్తాలు అన్లోడ్ చేసుకోవాలంటే ఎఫ్‌సీఐ నుంచి వింత సమాధానం వస్తున్నది. గోదాములు ఖాళీ లేవంటూ మొండిగా సమాధానం రావడంతో జిల్లా అధికారులు కంగు తింటున్నారు.
ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్‌కు ఫోన్లు చేస్తే సమాధానం ఇవ్వరు. కనీసం ఫోన్లు కూడా ఎత్తేందుకు సాహసించని దుస్థితి ఎదురవుతున్నది. కేంద్రం నుంచి మౌఖికంగా వచ్చిన ఆదేశాల మేరకు భారత ఆహార సంస్థ అధికారులు సైతం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లుగా అర్థం అవుతున్నది.