మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుండగా, ఈసారి రొయ్య పిల్లలను కూడా అందజేస్తున్నది. దీంతో మత్స్యకారుల కుటుంబాలకు మరింత ఆదాయం సమకూరనున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో 7 పెద్ద చెరువులు, ప్రాజెక్టుల్లో రొయ్యల పెంపకానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 10,75,660 రొయ్య పిల్లలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. వీటి కొనుగోలుకు రూ.27.96లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే చెరువులను గుర్తించడంతోపాటు పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వారం రోజుల్లో అన్ని చెరువుల్లో రొయ్య పిల్లలను వదిలే దిశగా జిల్లా అధికారులు అడుగులు వేస్తున్నారు. రొయ్యల పెంపకంతో జిల్లాలో 750 పైచిలుకు మత్స్యకారుల కుటుంబాలకు మేలు కలుగనున్నది.
పరిగి, డిసెంబర్ 10 : రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు మత్స్యకారుల కుటుంబాలకు తోడ్పాటునందిస్తూ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ఈ సంవత్సరం ఏకంగా రొయ్య పిల్లల పంపిణీ సైతం చేపట్టడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు లభిస్తున్నది. ఈసారి వికారాబాద్ జిల్లా పరిధిలో సుమారు 10,75,660 రొయ్య పిల్లలను ఉచితంగా అందజేసేందుకు నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా రొయ్యల పెంపకానికి 7 పెద్ద చెరువులు, ప్రాజెక్టులు ఎంపిక చేశారు.
7 చెరువుల్లో 10.75లక్షల రొయ్య పిల్లలు
జిల్లా పరిధిలో రొయ్య పిల్లల పెంపకానికి మత్స్యశాఖ అధికారులు 7 పెద్ద చెరువులు, ప్రాజెక్టులు ఎంపిక చేశారు. తాండూరు మండలం అల్లాపూర్ ప్రాజెక్టులో 78,000 రొయ్య పిల్లలు, యాలాల్ మండలం జుంటుపల్లి ప్రాజెక్టులో 1,18,200, యాలాల్ మండలం చిన్నవాగు ప్రాజెక్టులో 10,060, కోట్పల్లి మండలం కోట్పల్లి ప్రాజెక్టులో 5,24,400, మోమిన్పేట్ మండలం నందివాగు ప్రాజెక్టులో 96,000, వికారాబాద్ మండలం సర్పన్పల్లి ప్రాజెక్టులో 1,15,500, పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టులో 1,33,500 రొయ్య పిల్లలు ఉచితంగా వదలనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 690 చెరువుల్లో 87.88లక్షలు 35-40 మి.మీటర్ల పొడవులో చిన్న చేప పిల్లలు, 25.96లక్షలు 80-100 మి.మీటర్ల సైజులో ఉండే పెద్ద చేప పిల్లలు వదిలారు. వాటికి తోడుగా రొయ్యల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన చెరువుల్లో ప్రభుత్వమే రొయ్య పిల్లలను తెప్పించి ఉచితంగా ఆయా చెరువుల్లో వదలుతున్నది. జిల్లాలోని మోమిన్పేట్ మండలం నందివాగులో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ రొయ్య పిల్లలను చెరువులో వదిలారు. మిగతా ప్రాంతాల్లోని చెరువుల్లో వారం రోజులలోపు రొయ్య పిల్లలు వదిలేందుకు మత్స్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా హెక్టారు విస్తీర్ణంలోని నీటిలో 2వేల చేప పిల్లలు, ఒక వెయ్యి రొయ్య పిల్లల పెంపకం చేపట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రొయ్యల పెంపకంతో మంచి ఆదాయం..
రొయ్యల పెంపకంతో మత్స్యకారుల కుటుంబాలకు మంచి ఆదాయం సమకూరనున్నది. జిల్లా వ్యాప్తంగా 690 చెరువుల్లో కోటి 13లక్షలకు పైగా చేప పిల్లలు వదలడంతో ఆయా చెరువుల్లో చేప పిల్లలు పట్టుకొని జీవించే సుమారు 4వేల పైచిలుకు మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి లభించడంతోపాటు ఆర్థికంగా ఎదుగడానికి ఉపయోగపడనున్నది. 7 చెరువుల్లో 10.75లక్షల రొయ్య పిల్లల పెంపకంతో సుమారు 750 పైచిలుకు మత్స్యకారుల కుటుంబాలకు మేలు చేకూరనున్నది. ప్రభుత్వం టెండర్ల ద్వారా రొయ్య పిల్లలను కొనుగోలు చేసేందుకు రూ.2.60 ఖర్చు చేస్తున్నది. రూ.27.96లక్షలు ఖర్చు చేసి 10,75,660 రొయ్య పిల్లలను ఉచితంగా చెరువుల్లో వదిలి పెట్టనున్నది. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల 1.5 ఇంచుల పొడవు ఉండగా రాబోయే 5 నుంచి 6 నెలల్లో ఒక్కోటి సుమారు వంద గ్రాముల వరకు పెరుగుతుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. తద్వారా మంచి బరువుతో వాటిని విక్రయించవచ్చు. మార్కెట్లో చేపల కంటే రొయ్యలకు మంచి డిమాండ్ ఉన్నది. కిలో రొయ్యలు రూ.500 నుంచి రూ.600 వరకు సైతం విక్రయించవచ్చు. తద్వారా ఇతర ప్రాంతాలకు కాకుండా మండల కేంద్రాల్లో రొయ్యల విక్రయాలు చేపట్టడానికి అవకాశం ఉన్నది.
వారం రోజుల్లో రొయ్య పిల్లలు వదులుతాం..
వికారాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 7 ప్రాజెక్టులు, పెద్ద చెరువుల్లో పెంపకానికి 10.75లక్షల రొయ్య పిల్లలు ఉచితంగా అందిస్తున్నాం. జిల్లాలోని చెరువుల్లో రొయ్యల పెంపకానికి అనువుగా ఉంటుంది. అన్ని పరిశీలించి ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో వారం రోజులలోపు రొయ్య పిల్లలు వదిలే కార్యక్రమం చేపడుతాం. చేపలతోపాటు రొయ్యల పెంపకం మత్స్యకారుల కుటుంబానికి లబ్ధిని చేకూరుస్తున్నది. మార్కెట్లో రొయ్యలకు మంచి డిమాండ్ ఉండడంతో రొయ్యల పెంపకం లాభసాటిగా మారుతున్నది.